
తెల్లజుట్టు (Premature Greying) అనేది నేడు యువతను వేధిస్తున్న ప్రధాన సమస్య. 30 ఏళ్ల లోపే జుట్టు తెల్లబడటంతో చాలామంది ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలో తెల్ల వెంట్రుకలను పీకివేయడం వల్ల అవి మరింత వ్యాపిస్తాయని భయపడుతుంటారు. అయితే, ఈ భయం వెనుక సైన్స్ ఏం చెబుతోంది? జుట్టు రంగును నిర్ణయించే మెలనిన్ తగ్గడానికి గల కారణాలేంటి? ఖరీదైన హెయిర్ కలర్స్ వాడకుండానే, ఉసిరి, బ్లాక్ టీ వంటి సహజ పదార్థాలతో జుట్టును ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం..
అపోహ వర్సెస్ వాస్తవం: నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక తెల్ల వెంట్రుకను పీకడం వల్ల పక్కన ఉన్న వెంట్రుకలు తెల్లగా మారవు. జుట్టు రంగు అనేది చర్మం లోపల ఉండే మెలనిన్ (Melanin) అనే వర్ణద్రవ్యం మీద ఆధారపడి ఉంటుంది. వయస్సు, ఒత్తిడి, పోషకాహార లోపం లేదా వంశపారంపర్య కారణాల వల్ల మెలనిన్ తగ్గినప్పుడు జుట్టు తెల్లబడుతుంది. అయితే, తెల్ల వెంట్రుకను పదేపదే పీకడం వల్ల ఆ ప్రదేశంలో కుదుళ్లు (Hair Follicles) దెబ్బతిని, జుట్టు శాశ్వతంగా రాలిపోయే ప్రమాదం ఉంది.
తెల్ల జుట్టుకు సహజ నివారణలు:
ఉసిరి మరియు శికాకై: ఉసిరి పొడిని పెరుగు లేదా నీటితో కలిపి పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. ఇది జుట్టును బలోపేతం చేసి సహజ నలుపును అందిస్తుంది.
బ్లాక్ టీ: బ్లాక్ టీలో ఉండే టానిక్ యాసిడ్ జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. వారానికి 2-3 సార్లు బ్లాక్ టీ నీటితో జుట్టును కడగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
హెన్నా, కాఫీ: గోరింటాకు (Henna) పొడిలో డికాషన్ కలిపి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు దీనిని జుట్టుకు రాసుకుంటే జుట్టుకు మంచి ముదురు రంగు వస్తుంది.
ఆహారంలో విటమిన్ బి12 మరియు ఐరన్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా అకాల నెరపును అరికట్టవచ్చు.
గమనిక: ఈ కథనంలో అందించిన విషయాలు కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది కేవలం సమాచారం మాత్రమే, దీనికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. జుట్టు సమస్య తీవ్రంగా ఉన్నా లేదా అలర్జీలు ఉన్నా చికిత్స కోసం చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం ఉత్తమం.