
గోళ్లు కేవలం అందానికే కాదు.. అవి మన ఆరోగ్యాన్ని, మనం ఎంతకాలం జీవిస్తామో కూడా చెబుతాయని ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ డాక్టర్ డేవిడ్ సింక్లెయిర్ వెల్లడించారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన డేవిడ్ ప్రకారం.. గోళ్లు పెరిగే వేగం మన శరీరం ఎంత బాగా పనిచేస్తుందో చెప్పే ఒక ముఖ్యమైన సూచిక. “మీ గోళ్ల పెరుగుదల రేటు మీరు వృద్ధాప్యంలో ఉన్నారా లేదా అనేదానికి నిజంగా ఒక మంచి ఇండికేటర్” అని డాక్టర్ సింక్లెయిర్ అన్నారు. గోళ్లు ఎంత వేగంగా పెరుగుతున్నాయో అనే దాన్ని బట్టి మీ జీవసంబంధమైన వయస్సు తెలుసుకోవచ్చు. దీని అర్థం మీరు పుట్టిన రోజు ప్రకారం ఉన్న వయసు కాకుండా మీ శరీరం లోపల ఎంత ఆరోగ్యంగా ఉందో చెప్పే వయసు అన్నమాట.
మీ గోళ్లు వేగంగా పెరుగుతున్నాయంటే.. మీరు సగటు మనుషుల కంటే నెమ్మదిగా వృద్ధాప్యం చెందుతున్నారని అర్థం. అంటే మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. 30 ఏళ్లు దాటాక గోళ్ల పెరుగుదల రేటు కొద్దిగా తగ్గుతుంది. దీనికంటే మరీ నెమ్మదిగా పెరిగితే మీరు వయసు కంటే త్వరగా ముసలితనం వైపు వెళ్తున్నట్లు సూచన కావచ్చు. ఈ అధ్యయన ఫలితాలను తెలుసుకున్న తర్వాత డాక్టర్ సింక్లెయిర్ కూడా తన గోళ్ల పెరుగుదలను తరచుగా పర్యవేక్షిస్తున్నానని తెలిపారు.
వయసు పెరిగే కొద్దీ గోళ్లు మారుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం రక్త ప్రసరణ మందగించడం, దీనివల్ల గోళ్లకు పోషకాలు తక్కువగా అందుతాయి. ఫలితంగా వయసు మీద పడినప్పుడు గోళ్లు నీరసంగా, పెళుసుగా మారవచ్చు. అయితే, వయసు మాత్రమే కాదు, గోళ్లలో వచ్చే కొన్ని మార్పులు తీవ్ర అనారోగ్యాలకు సంకేతం కావచ్చు
నల్లటి మచ్చలు -గీతలు: గోళ్ల కింద నల్ల మచ్చలు కనిపిస్తే అది చర్మ క్యాన్సర్ లాంటి తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు.
తెల్లటి మచ్చలు – గీతలు: శరీరంలో జింక్, కాల్షియం లేదా ఐరన్ లోపం ఉన్నట్లు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు అర్థం చేసుకోవచ్చు.
గోళ్లు వంకర పోవడం: గోళ్లు వెడల్పుగా మారి, వేలిముద్రల వైపు చుట్టుకుంటే అది శరీరంలో ఆక్సిజన్ లోపం ఉన్నట్లు సూచిస్తుంది. ఇది దీర్ఘకాలిక గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధులకు సంకేతం కావచ్చు.
గోళ్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, వాటిలో కనిపించే ఏవైనా అసాధారణ మార్పులను వైద్యులకు చూపించడం ముఖ్యం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..