కొబ్బరి చెట్టు ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు.. కొబ్బరి ఆకులు సహా చెట్టు మొత్తం ఉపయోగపడుతుంది. ఇక కొబ్బరికాయలు, బొండాల ప్రయోజనం తెలిసిందే. ఎండుకొబ్బరి, పచ్చి కొబ్బరి, లేత కొబ్బరిని విరివిగా ఉపయోగిస్తారు. అలాంటిది ఇప్పుడు కొబ్బరి పీచు కూడా అనేక రకాలుగా ఉపయోగిస్తారని తెలిస్తే మీరు షాక్ అవుతారు. కొబ్బరిపీచును వ్యర్థాలుగా పారేస్తాం కానీ, ఇకపై అలా చేయకండి..! ఆ తొక్కతో చాలా రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే ముందుగా కొబ్బరి పీచు ప్రయోజనాలేంటో తెలుసుకోండి..
ఎవరైనా గాయపడినట్లయితే వాపు ఉన్న ప్రదేశంలో కొబ్బరి నూనెను పూస్తారు. అయితే అలా కాకుండా కొబ్బరి పొట్టును మెత్తగా నూరి అందులో పసుపు కలిపి గాయాలు, వాపు ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతుంది. అంతేకాదు, కొబ్బరి పీచు అతిసారం, జీర్ణ సమస్యలకు నివారణగా పనిచేస్తుంది. డయేరియాతో బాధపడుతున్న వారికి కొబ్బరి పీచుతో తయారు చేసిన నీళ్లు తాగిస్తే త్వరగా ఉపశమనం పొందుతారు. కొన్ని దేశాల్లో కొబ్బరి పీచుతో తయారు చేసిన నీటిని కూడా విక్రయిస్తారని తెలిస్తే ఆశ్చర్యపోతారు. కొబ్బరి పీచు నీళ్లను తయారు చేయడానికి ముందుగా దానిని బాగా శుభ్రంగా కడిగి నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడపోసి గోరువెచ్చగా తాగితే విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పసుపు దంతాల సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి కూడా కొబ్బరి పీచు ఉపయోగపడుతుంది. కొబ్బరి పొట్టు ఉపయోగించి దంతాల పసుపును తొలగించవచ్చు. ఇందుకోసం కొబ్బరి పొట్టును బాగా వేయించి అందులో సోడా కలిపి దంతాలపై మృదువుగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల మీ దంతాలు ముత్యాల్లా తెల్లగా మారుతాయి. పైల్స్ సమస్య నుండి బయటపడేందుకు కొబ్బరి పొట్టును కూడా ఉపయోగించవచ్చు. కొబ్బరి పొట్టును మెత్తగా చేసి ఖాళీ కడుపుతో నీళ్లలో వేసి తాగితే ఫలితం ఉంటుంది. దీంతో పైల్స్ సమస్య తొలగిపోతుంది.
కొబ్బరి పొట్టులో ఉండే పీచు శరీరంలోని అనేక సమస్యలను నయం చేస్తుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి కొబ్బరి పీచు మంచి ఔషధం. ఆర్థరైటిస్ నొప్పితో బాధపడుతున్న వారికి కొబ్బరి పీచు టీ తాగిస్తారు. కొబ్బరి పొట్టులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇక తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చడానికి కూడా కొబ్బరి పొట్టును ఉపయోగిస్తారు. ఇందుకోసం బాణలిలో కొబ్బరి పొట్టును వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత దాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పొడిని కొబ్బరి నూనెలో మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు సహజంగా నల్లగా మారుతుంది.
ఇకపోతే, వంట పాత్రలను శుభ్రం చేయడానికి కూడా కొబ్బరి పీచు మంచి స్క్రబ్‌గా ఉపయోగపడుతుంది. పూర్తం రోజుల్లో కూడా ప్రజలు ఎక్కువగా కొబ్బరి పీచునే ఉపయోగించేవారు. మార్కెట్‌లో లభించే స్క్రబ్‌లకు బదులుగా ఈ కొబ్బరి పీచును ఉపయోగించండి. దీంతో మీ ఖర్చు తగ్గుతుంది. పని కూడా సులువుగా ఉంటుంది. పైగా పర్యావరణ హితంగా కూడా పనిచేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..