Cockroaches: ఇంట్లో బొద్దింకలను ఆకర్షించేవి ఈ వస్తువులే.. వీటిని తొలగిస్తే శాశ్వతంగా రిలీఫ్..

మీ ఇంట్లో బొద్దింకలు ఉన్నాయా? అవి కేవలం ఇబ్బందే కాదు, ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా ఇంట్లో మనం చేసే కొన్ని పొరపాట్లే వీటిని ఇంట్లోకి ఆహ్వానిస్తాయి. రసాయనాలతో తాత్కాలికమే తప్ప, పూర్తిగా వీటిని తొలగించలేం. అసలు బొద్దింకలు ఇంట్లో ఎక్కడ ఆశ్రయం పొందుతాయి.. మనం తెలియకుండా చేసే పొరపాట్లేంటి.. వాటిని ఎలా తరిమేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Cockroaches: ఇంట్లో బొద్దింకలను ఆకర్షించేవి ఈ వస్తువులే.. వీటిని తొలగిస్తే శాశ్వతంగా రిలీఫ్..
How To Control Cockroaches

Updated on: Jul 21, 2025 | 7:37 PM

ప్రతి ఇంట్లోనూ బొద్దింకలు సాధారణంగా కనిపిస్తుంటాయి. అయితే, వీటిని అలాగే వదిలేయడం ప్రమాదకరం. బొద్దింకలు కేవలం చిరాకు పెట్టడమే కాదు, అవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, ముఖ్యంగా వంట పాత్రలను కలుషితం చేసి, మనల్ని వివిధ వ్యాధుల బారిన పడేస్తాయి. చిన్నపిల్లలకు వీటి వల్ల తొందరగా వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది. ఎన్ని రకాల రసాయనాలు వాడినా అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి తప్ప, శాశ్వత నిర్మూలన జరగదు.

బొద్దింకలు ఎక్కడ ఆశ్రయం పొందుతాయి? వాటికి కారణాలు ఏంటి?

బొద్దింకలు సాధారణంగా పరిశుభ్రత లేని ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడతాయి. రాత్రిపూట తిన్న ఆహారం ప్లేట్లను కడగకుండా వదిలేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, నీటిని నిల్వ ఉంచడం, గోడలు లేదా నేలపై పగుళ్లు కలిగి ఉండటం, వస్తువులను అస్తవ్యస్తంగా పెట్టడం, పైపులు లీకవడం వంటివి వాటికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. వార్తా పత్రికలు, కార్డ్ బోర్డ్ పెట్టెలు, బియ్యం బస్తాలు, సెల్ఫ్‌లలో వేసిన పేపర్ల కింద బొద్దింకలు గుంపులు గుంపులుగా స్థావరాన్ని ఏర్పరచుకుంటాయి. ఈ ప్రదేశాలలో అవి సురక్షితంగా ఉంటూ, వేగంగా వృద్ధి చెందుతాయి.

శాశ్వత నిర్మూలన కోసం..

బొద్దింకలను ఒక్కసారిగా పూర్తిగా నశింపజేయడం కష్టం కావచ్చు. కానీ నిరంతరం శుభ్రతను పాటిస్తూ వాటి బెడద నుండి బయటపడవచ్చు.

పగుళ్లు, సందుల మూసివేత: బొద్దింకలు రాకుండా ఇంటి గోడలలో, నేలమీద ఉన్న బొరియలు, పగుళ్లను వీలైనంత త్వరగా మూసివేయాలి.

నీటి నిల్వల తొలగింపు: ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. తేమ ఉన్న ప్రదేశాలను శుభ్రంగా, పొడిగా ఉంచాలి.

అనవసర వస్తువుల తొలగింపు: ఇంట్లో ఉన్న అనవసర వస్తువులను, పాత వార్తా పత్రికలను, కార్డ్ బోర్డులను తొలగించాలి. ఇవి బొద్దింకలకు ఆశ్రయం ఇస్తాయి.

నిరంతర శుభ్రత: దుమ్ము, ధూళి పేరుకుపోకముందే తరచుగా శుభ్రం చేయాలి. వంట పాత్రలను ఏ పూటకి ఆ పూటే కడిగి పెట్టాలి.

పరిసరాల పరిశుభ్రత: ఇంటి చుట్టూ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మురికి వాసన రాకుండా చూసుకోవాలి.

క్రమపద్ధతిగా వస్తువులు: ఉతికిన బట్టలను చిందరవందరగా కాకుండా, ఆ రోజువి ఆ రోజు మడిచి పెట్టాలి. వస్తువులను క్రమబద్ధంగా అమర్చుకోవాలి.

వారానికోసారి శుభ్రత: కనీసం వారానికి ఒకసారైనా ఇంట్లో వస్తువుల వెనుకవైపు, సెల్ఫ్‌ల కింద ఉన్న చెత్తను తొలగించి శుభ్రం చేయాలి. కుళ్ళిన పదార్థాలను ఇంట్లో నిల్వ ఉంచకూడదు.

ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా బొద్దింకల వ్యాప్తిని తగ్గించి, వ్యాధుల బారి నుండి మన కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకరమైన జీవనానికి పునాది.