ప్రతి సీజన్‌లోనూ తప్పనిసరిగా చర్మాన్ని సంరక్షించుకోవాలి. చర్మసంరక్షణ, జాగ్రత్తలు తీసుకోవడమంటే ఖరీదైన క్రీములు, లోషన్లు వాడటం, సెలూన్లు, పార్లర్లలో డబ్బు ఖర్చు చేయడం కాదు. చాలా మంది స్కిన్ కేర్ పేరుతో కెమికల్ ఉత్పత్తులను ముఖానికి రాసుకుంటారు. ఇది ప్రయోజనానికి బదులుగా హాని చేస్తుంది. చాలా సార్లు ముఖం మీద దద్దుర్లు, నల్ల మచ్చలు, అలెర్జీలు వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ, చర్మ సమస్యలకు మార్కెట్‌లో లభించే ఖరీదైన మందులు, ఉత్పత్తులను వాడే బదులు సహజ పోషకాహారం ఎల్లప్పుడూ చర్మానికి మేలు చేస్తుంది. స్కిన్ కేర్ కోసం బజారుకు వెళ్లే బదులు ఒక్కసారి మీ కిచెన్ వైపు చూసుకుంటే.. పరిష్కారం లభిస్తుంది. అవును నిజమే..మన వంటగది ఒక విధంగా మాయా నగరం లాంటిది. ఇక్కడ మన సమస్యలన్నింటికీ పరిష్కారం ఉంది. కానీ, ఏ పదార్థాన్ని ఎలా ఉపయోగించాలి..? అది దేనికి పరిష్కారం అనే విషయాలపై మనకు అవగాహన ఉండాలి. అలాంటిదే దాల్చిన చెక్క కూడా. దాల్చిన చెక్క ఫేస్ ప్యాక్ మీకు మెరిసే, అందమైన చర్మాన్ని ఇస్తుందని చాలామందికి తెలియదు. అవును ఇది నిజం. మెరిసే చర్మం కోసం దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
1. దాల్చిన చెక్క ఆలివ్ నూనె:
ముఖ సౌందర్యాన్ని పెంచడానికి దాల్చిన చెక్క పొడి, ఆలివ్ నూనెను ఒక గిన్నెలో మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. చేతులతో తేలికపాటి మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల చర్మం తేమను పొంది రక్త ప్రసరణ పెరుగుతుంది. మీ చర్మం పొడిగా ఉంటే ఖచ్చితంగా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
2. దాల్చిన చెక్క పొడి, తేనె:
దాల్చిన చెక్కలో యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ముఖ చర్మాన్ని కాపాడేందుకు ఉపయోగపడుతుంది. ఇది అనేక చర్మ సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్ స్పూన్ల తేనె మిక్స్ చేసి ముఖానికి వృత్తాకారంలో స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి.. అరగంట పాటు అలాగే ఉంచాలి. చివరగా గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇది ముఖంపై మచ్చలను తొలగిస్తుంది.
3. దాల్చిన చెక్కపొడి, కొబ్బరి నూనె:
దాల్చిన చెక్క పొడి, కొబ్బరి నూనె ఫేస్ ప్యాక్ చర్మం దురద నుండి ఉపశమనానికి సహాయపడుతుంది. ఇది చర్మానికి పోషణనిచ్చి పొడిబారకుండా చేస్తుంది. దాల్చిన చెక్క పొడిలో కొన్ని చుక్కల కొబ్బరి నూనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయాలి.
4. దాల్చిన చెక్కపొడి, పెరుగు:
దాల్చిన చెక్కలాగే పెరుగు కూడా చర్మానికి మేలు చేస్తుంది. ఒక చెంచా దాల్చిన చెక్క పొడి, సమాన పరిమాణంలో పెరుగు మిశ్రమం, కొంచెం తేనె కలపండి. ఈ ఫేస్ ప్యాక్‌ని మీ ముఖానికి అప్లై చేసి సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఈ పద్ధతి మీ చర్మపు రంగును నిగారింప చేస్తుంది.
5. దాల్చిన చెక్క పొడి, అరటిపండు:
ముఖ సౌందర్యానికి దాల్చిన చెక్కపొడి, అరటిపండు ఫేస్ ప్యాక్ ఉపయోగించవచ్చు. అరటిపండును బాగా మెత్తగా చేసి, ఆపై ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని వేసి కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. కాసేపు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇది మీ ముఖానికి అద్భుతమైన మెరుపును తెస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..