AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రియల్లీ ఇన్‌స్పిరేషనల్..! టైమ్స్‌ 100లో నిలిచిన మాస్టర్ షెఫ్ వికాస్ ఖన్నా విజయ ప్రస్థానం

సాధారణంగా వంట చేసే మగవారిపై లోకం జోకులు వేయడం మనం చూస్తుంటాం. కానీ వంట అనేది కేవలం ఆకలి తీర్చే ప్రక్రియ మాత్రమే కాదు.. అది ఒక గొప్ప విజయపథం కాగలదని నిరూపించారు ప్రఖ్యాత షెఫ్ వికాస్ ఖన్నా. అమృత్‌సర్‌లోని ఒక చిన్న వంటగదిలో తల్లి వెనుక తిరుగుతూ వంట నేర్చుకున్న ఆయన.. నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా ‘టైమ్ 100- 2026’లో చోటు సంపాదించుకున్నారు.

రియల్లీ ఇన్‌స్పిరేషనల్..! టైమ్స్‌ 100లో నిలిచిన మాస్టర్ షెఫ్ వికాస్ ఖన్నా విజయ ప్రస్థానం
Vikas Khanna
Nikhil
|

Updated on: Apr 19, 2026 | 6:00 AM

Share

సాధారణంగా వంట చేసే మగవారిపై లోకం జోకులు వేయడం మనం చూస్తుంటాం. కానీ వంట అనేది కేవలం ఆకలి తీర్చే ప్రక్రియ మాత్రమే కాదు.. అది ఒక గొప్ప విజయపథం కాగలదని నిరూపించారు ప్రఖ్యాత షెఫ్ వికాస్ ఖన్నా. తాజాగా విడుదలైన ప్రతిష్టాత్మక ‘టైమ్ 100- 2026’జాబితాలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌లతో పాటు ప్రముఖ షెఫ్ వికాస్ ఖన్నా నిలవడం భారతీయ వంటగదికి దక్కిన గొప్ప గౌరవంగా భావించవచ్చు. కేవలం ఒక షెఫ్‌గానే కాకుండా మానవతావాదిగా ఆయన చేస్తున్న సేవలకు ఈ అరుదైన గుర్తింపు లభించింది.

అమ్మ నేర్పిన పాఠాలే పునాది..

వికాస్ ఖన్నా ప్రయాణం ఎన్నో సవాళ్లతో మొదలైంది. చిన్నతనంలో ‘క్లబ్ ఫుట్’ సమస్య వల్ల ఆయన సరిగ్గా నడవలేకపోయేవారు. పాఠశాలలో తోటి పిల్లలు హేళన చేస్తుంటే కుంగిపోకుండా తన తల్లి బిందూ ఖన్నా అండతో వంటగదిని తన ప్రపంచంగా మార్చుకున్నారు. ‘కాళ్లకు సత్తువ లేకపోతే ఏంటి.. నా చేతులు వంట చేయగలవు కదా’ అని ధైర్యం తెచ్చుకున్నారు. అమ్మ వంట చేసేటప్పుడు పడే ఓపికను, శుభ్రతను నిశితంగా గమనించేవారు. ‘పిండిని ప్రేమతో కలిపి మెత్తగా కాల్చడం నేర్చుకుంటే నీకు వంట వచ్చినట్టే’ అని తల్లి చెప్పిన మాటలే ఆయనకు తొలి పాఠాలయ్యాయి. కేవలం 16 ఏళ్ల వయసులోనే ‘లారెన్స్ గార్డెన్’ పేరుతో క్యాటరింగ్ నడుపుతూ కస్టమర్ల నమ్మకమే నిజమైన ధనం అనే వ్యాపార సూత్రాన్ని వంటబట్టించుకున్నారు.

అమెరికాలో భారతీయ రుచులు..

వంటను ఒక వృత్తిగా కాకుండా ప్రార్థనగా భావించే వికాస్.. అమృత్‌సర్ నుండి అమెరికా వరకు తన ప్రయాణాన్ని సాగించారు. న్యూయార్క్‌లో రెస్టరెంట్లు తెరిచి అంతర్జాతీయ వేదికలపై భారతీయ రుచుల సత్తా చాటారు. సాధారణంగా భారతీయ రెస్టరెంట్లకు దక్కని ప్రతిష్టాత్మక ‘మిచెలిన్ స్టార్’ హోదాను ఆయన సొంతం చేసుకున్నారు. తనకు ఇంగ్లీష్ సరిగ్గా రానప్పుడు తన వంటలే ప్రపంచంతో మాట్లాడాయని ఆయన గర్వంగా చెబుతుంటారు. తన దేశాన్ని, తన ప్రేమను ప్లేటులో పెట్టి ప్రపంచానికి అందించిన వికాస్.. నేడు 40కి పైగా వంటల పుస్తకాలు రాయడమే కాకుండా ‘ది లాస్ట్ కలర్’ అనే సినిమాతో ఫిల్మ్ మేకర్‌గా కూడా తన ముద్ర వేశారు.

నిజమైన మానవతావాది..

వికాస్ ఖన్నాను కేవలం ఒక గొప్ప షెఫ్‌గా మాత్రమే కాకుండా ఒక గొప్ప మనసున్న వ్యక్తిగా ‘టైమ్’ గుర్తించింది. కోవిడ్ కష్టకాలంలో ‘ఫీడ్ ఇండియా’ పేరుతో భారతదేశంలో లక్షల మందికి ఆహారం అందించి అండగా నిలిచారు. ‘ఒకరి ఆకలి తీర్చడం కంటే మించిన సంతృప్తి మరొకటి లేదు’ అనేది ఆయన దృఢ నిశ్చయం. అమ్మ నేర్పిన ఆప్యాయతను వడ్డించడం మరువకుండా నిరంతరం సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నారు. తన విజయానికి కారణం తన తల్లి ఆశీస్సులు ఇంకా ఆమె నేర్పిన క్రమశిక్షణే అని ఆయన వినమ్రంగా చెబుతారు.

వికాస్ ఖన్నా సాధించిన ఈ విజయం అకుంఠిత దీక్ష ఇంకా పట్టుదల ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా చేరుకోవచ్చని నిరూపిస్తోంది. ఒక సాధారణ వంటవాడిగా మొదలైన ఆయన ప్రస్థానం నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి స్ఫూర్తినిస్తోంది. వంటగదిలోని పసుపు రంగు తలుపుల నుండి టైమ్ పత్రిక కవర్ పేజీ వరకు సాగిన ఈ ప్రయాణం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. అంకితభావంతో పనిచేసే ఎవరికైనా విజయం దాసోహం అవుతుందని వికాస్ ఖన్నా నిరూపించారు. మన సంప్రదాయ వంటకాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఈ మాస్టర్ షెఫ్‌కు అభినందనలు తెలపాల్సిందే.

Follow Us