
భారతదేశ ఆర్థిక శాస్త్ర, నీతిశాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు మానవుల ప్రవర్తన గురించి తన నీతిశాస్త్ర పుస్తకంలో వివరించారు. ఒక వ్యక్తి ఎలా ఉండాలి..? ఎలా ఉండకూడదో వివరించాడు. ఒక వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటే విజయానికి చేరువ అవుతాడు. ఎలాంటి ప్రవర్తన అతడ్ని కష్టాలపాలు చేస్తుందనే విషయాలను వెల్లడించారు. మానవ జీవితానికి సంబంధించిన దాదాపు అన్ని కోణాలపై ఆయన నీతిశాస్త్ర గ్రంథంలో వివరించారు. చాణక్యుడి ప్రకారం, ప్రపంచంలో కొన్ని ప్రదేశాలకు అజాగ్రత్తగా వెళ్లకూడదు. అలాంటి ప్రదేశాలకు వెళితే మన జీవితం అస్తవ్యస్తమవుతుంది. సమాజంలో గౌరవం కోల్పోవడమే కాకుండా, తీవ్రమైన సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది.
అందుకే అటువంటి ప్రదేశాలను దూరంగా ఉంచాలని చాణక్యుడు హెచ్చరిస్తాడు. ఇప్పుడు ఆయన సూచించిన ఆ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
చాణక్యుడు ఎప్పుడూ పరాయి దేశానికి లేదా మీకు పరిచయం ఉన్నవారు ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లవద్దని చెబుతాడు. అలాంటి చోట మీరు సమస్యల్లో పడితే సహాయం చేసే వారు ఎవరూ ఉండరు. అంతేకాకుండా, అపరిచితులు మీకు హాని చేయడం లేదా దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు అది ప్రాణాపాయానికి కూడా దారి తీస్తుంది. అందువల్ల, మీకు అండగా నిలిచే వారు లేని ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలని చాణక్యుడి సలహా.
పదే పదే అవమానానికి గురయ్యే ప్రదేశానికి ఎప్పుడూ వెళ్లకూడదని చాణక్యుడు చెప్పాడు. నిరంతర అవమానం మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన వ్యక్తి జీవితంలో ముందుకు సాగలేడు. కాబట్టి మీరు అవమానింపబడే చోటుకు తెలిసీ గానీ, తెలియక గానీ వెళ్లకూడదని ఆయన సూచించాడు.
ఉపాధి అవకాశాలు లేని ప్రాంతానికి వెళ్లడాన్ని చాణక్యుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. మీ శ్రమకు, నైపుణ్యాలకు తగిన ఫలితం లభించని చోట మీరు జీవనోపాధి కోసం కష్టపడాల్సి వస్తుంది. చివరకు ఆకలితో అలమటించే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఉపాధి అవకాశాలు లేని ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం ఇతరల వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)