
ఆచార్య చాణక్యుడు రాజకీయ, పరిపాలనా విషయాలలో మాత్రమే కాదు జీవితంలోని ప్రతి అంశంలోనూ ఆయన చెప్పిన విషయాలు మార్గనిర్దేశం చేస్తాయి. ముఖ్యంగా నేటి కాలంలో అపార్థాలు, అసూయ, ఇతరులతో పోలిక.. సర్వసాధారణంగా మారాయి. ఇటువంటి పరిస్థితిలో ప్రతిదాని గురించి ఎదుటి వారికి నిజం చెప్పడం తెలివైన పని అనిపించుకోదని చాణక్య నీతి మనకు చెబుతుంది. మనం చెప్పే విషయాలు తప్పుడు వ్యక్తుల వద్దకు చేరితే, సహకారానికి బదులుగా హాని కలిగించేందుకు వినియోగిస్తారు. కాబట్టి ఆత్మగౌరవం, మానసిక శాంతి, గౌరవాన్ని కాపాడుకోవడానికి కొన్ని సరిహద్దులను నిర్ణయించడం అవసరం. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కుటుంబ కలహాలు, తగాదాల గురించి ఇతరులకు ముఖ్యంగా బంధువులకు చెప్పకూడదు. వీరు మీ విషయాలను తెలుసుకుని పుకార్లుగా వ్యాప్తి చేస్తారు. దీంతో సమస్య మరింత తీవ్రమవుతుంది.
మీ మానసిక బాధను ఏ బంధువుతోనూ పంచుకోకండి. అందరూ తమ భావాలను ఆహ్లాదకరమైన రీతిలో వ్యక్తపరచరు. కొందరు దానిని ఆయుధంగా కూడా ఉపయోగించవచ్చు.
బంధువుల జోక్యం మీ బంధాల్లో అనుమానాన్ని, దూరాన్ని తీసుకురాగలదు. కాబట్టి మీ నిజమైన ప్రేమను ప్రపంచం దృష్టి నుంచి కాపాడుకోండి. దీని గురించి ఎవరికీ చెప్పకండి. అప్పుడు మీ బాంధవ్యాలు సురక్షితంగా ఉంటాయి.
మీ బంధువులకు మీ ఆదాయం గురించి చెప్పడం వల్ల అసూయ, పోలిక, అవాంఛిత ఒత్తిడి పెరుగుతాయి. కాబట్టి మీ ఆదాయం తెలిసిన వ్యక్తులు తక్కువగా ఉంటే, మీ జీవితం అంత సురక్షితంగా ఉంటుంది.
గతంలో మీరు అనుభవించిన బాధలు, పోరాటాలు, పాత అవమానాలు వంటి మరే ఇతర గత సమస్యలను ఎవరితోనూ ప్రస్తావించవద్దు. ఎందుకంటే ఎదుటి వారు మీ బలహీనతలను గుర్తుంచుకుంటారు. మీ కృషిని కాదు.
మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా ఎవరితో మాట్లాడకూడదు. ఎందుకంటే మీ శత్రువులు అప్రమత్తంగా ఉంటారు. వాటిని అడ్డుకోవచ్చు. నెరవేరని కలలపై ప్రతికూలత, ఇబ్బందులు త్వరగా వస్తాయి.
మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. ఇది మీ ఇమేజ్, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.
దానధర్మాలు రహస్యంగా చేసినప్పుడు మాత్రమే పవిత్రంగా ఉంటాయి. ఇతరులకు చెప్పి చేసే దానధర్మాలు ఫలించవు. కాబట్టి మీ దానధర్మాల గురించి ఎవరికీ చెప్పకండి.
మీ బలహీనతల గురించి ఎవరికీ చెప్పకండి. శత్రువుకు మీ బలహీనతలు తెలిస్తే మీపై దాడి చేయడానికి అతనికి కత్తి అవసరం ఉండదు. మీ బలహీనతలనే వాడుతాడు.
మీరు మీ చెడు అలవాట్లు, లోపాల గురించి ఎవరికైనా బహిరంగంగా చెబితే వారి దృష్టిలో మీరు చులకనై పోతారు. దీని వలన మీ పేరు కూడా మసకబారుతుంది.
మీ నెరవేరని కలలను అందరితో పంచుకోకండి. ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేసి మీ ప్రేరణను హరిస్తారు. కాబట్టి మీ నెరవేరని కలల గురించి ఎవరికీ చెప్పకండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.