
శివ పార్వతుల బంధం చాలా ప్రత్యేకమైనది. కొంతమంది శివుడిని ప్రేమకు చిహ్నంగా చూస్తారు. ఆయన దివ్యమైన తపస్సు, సాధనతో సమానంగా పార్వతి ప్రేమను గౌరవించిన తీరు కారణంగా ఇది గుర్తింపు పొందింది. కానీ అదే సమయంలో మరికొంతమంది కొత్తగా పెళ్లైన జంటలు శివుడిని దర్శించకూడదని అంటారు.
శివుడు పార్వతిని వివాహం చేసుకున్నా.. ఎక్కువగా తపస్సులో ఉండేవారు. ఆయన జీవితం తరచూ ఏకాంతంలో గడిచేది. అందుకే శివుడిని దర్శించే జంటలు కూడా తనలా ఏకాంతంలో ఉండే పరిస్థితిని ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు. ఈ నమ్మకం ప్రకారం పెళ్లైన వెంటనే శివుడిని దర్శించడం వల్ల సంసార జీవితంలో ఒంటరితన భావనలు మొదలవుతాయని చెబుతారు.
కొంతమంది కొత్తగా పెళ్లైన దంపతులు హనీమూన్ కు మతపరమైన ప్రదేశాలను ఎంచుకుంటారు. కానీ వాస్తవానికి హనీమూన్ అనేది దంపతులు తమ మధ్య సాన్నిహిత్యం పెంపొందించుకునే ప్రత్యేక సమయం. అలాంటి సమయంలో దేవాలయాల వంటి పవిత్రమైన స్థలాలకు వెళ్లడం అనేది శుభసూచకంగా పరిగణించబడదు. ముఖ్యంగా శివాలయానికి ఈ సమయంలో వెళ్లకూడదన్న నమ్మకం కొన్ని చోట్ల ప్రాచుర్యంలో ఉంది. ఎందుకంటే ఆ వాతావరణం శాంతిగా, భక్తి భావంతో ఉండేలా ఉండాలని భావిస్తారు.
పురాణాల ప్రకారం శివలింగం పరమశివుని శక్తి స్వరూపంగా భావించబడుతుంది. దాన్ని స్పృశించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయనే నమ్మకం ఉంది. అయితే కొత్తగా పెళ్లైన వధూవరులు ఈ సమయంలో శివలింగాన్ని తాకకూడదని చెప్పబడుతుంది. శివలింగం స్థానంలో పార్వతీ దేవిని పూజించడం శుభకార్యంగా పరిగణించబడుతుంది. ఇది దంపతుల మధ్య సఖ్యతను పెంచి వారి దాంపత్య జీవితం సుఖంగా సాగేందుకు సహాయపడుతుందని విశ్వసిస్తారు.
పెళ్లైన వెంటనే పార్వతి దేవిని పూజించడం శుభప్రదమని అనేక పురాణాలు, గ్రంథాలు సూచిస్తున్నాయి. ఆమె కరుణ, శాంతి, ఐశ్వర్యం, సంతోషం వంటి శక్తుల ప్రతిరూపంగా భావించబడుతుంది. పార్వతీ దేవిని భక్తితో పూజించడం ద్వారా దాంపత్య జీవితం ప్రేమతో పరిపూర్ణంగా మారుతుందనే విశ్వాసం ఉంది. అందువల్ల కొత్తగా పెళ్లైన దంపతులు ఆమెను ఆరాధించడం ద్వారా శుభారంభంతో జీవితం ప్రారంభించవచ్చు.
పెళ్లైన కొత్త జంటలు శివుడిని దర్శించకూడదన్న నమ్మకం పూర్వీకుల విశ్వాసాలపై ఆధారపడినదే. శివుడిపై భక్తి భావం నిలుపుకుంటూనే.. జీవితం ప్రారంభంలో పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతో పార్వతి దేవిని పూజించడం శుభప్రదంగా భావించబడుతుంది.