
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జీవి అయిన నీలి తిమింగలం పాలు ఒక పెద్ద మిస్టరీ. ఇది చాలా పోషకాలతో నిండి ఉంటుంది. దాని అసాధారణ లక్షణాల కారణంగా ఈ పాలు ఎప్పుడూ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఈ పాలు తిమింగలం పిల్లల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక లీటరు నీలి తిమింగలం పాలలో ఏకంగా 50శాతం కొవ్వు ఉంటుంది. ఇది మనం తాగే ఆవు పాలు కంటే దాదాపు 12 రెట్లు ఎక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. తిమింగలం పిల్ల తన తల్లి పాలు తాగడం ద్వారా ప్రతి గంటకు 4 నుండి 5 కిలోల బరువు పెరుగుతుంది. దీని కారణంగా తిమింగలం పిల్ల ఒక రోజులో ఏకంగా 100 కిలోల వరకు బరువు పెరుగుతుంది. కేవలం ఆరు నెలల్లోపు నీలి తిమింగలం పిల్ల 25 టన్నుల భారీ బరువును చేరుకోగలుగుతుంది. ఆహారం కొరత ఉన్న అంటార్కిటికా వంటి ప్రదేశాలకు సుదీర్ఘ ప్రయాణాలు చేసే తల్లి తిమింగలాలకు ఈ వేగవంతమైన పెరుగుదల అవసరం.
తల్లి నీలి తిమింగలం రోజుకు ఏకంగా 200 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ పాలలో సుమారు 12శాతం ప్రోటీన్ ఉంటుంది. ఈ పాలు సాధారణ పాలలా కాకుండా టూత్‌పేస్ట్ లాగా చాలా మందంగా ఉంటాయి. దీని కారణంగా అవి నీటిలో కరిగిపోవు. ఈ పాలు క్రీమీగా, మందంగా, కొద్దిగా నీలం రంగులో ఉంటాయి.
పాలు ఇచ్చే విధానం: ఇతర క్షీరదాల మాదిరిగానే తిమింగలాలు కూడా తమ పిల్లలకు పాలిస్తాయి. నీటి అడుగున తల్లి తిమింగలం కండరాల చర్య ద్వారా భారీ ధార రూపంలో పాలను విడుదల చేస్తుంది. దానిని పిల్ల తిమింగలం వెంటనే తాగుతుంది.
సాధారణంగా మన జీర్ణవ్యవస్థ అంత పెద్ద మొత్తంలో కొవ్వును జీర్ణం చేసుకోలేక, వికారం కలుగుతుంది కాబట్టి ఈ పాలు మానవులకు త్రాగడానికి సరిపోవు. అయితే 2025లో నిర్వహించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. నీలి తిమింగలం పాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయని తేలింది.
గుండె ఆరోగ్యం: ఈ పాలను నేరుగా తాగడం మంచిది కానప్పటికీ దాని నుండి సేకరించిన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను సరిగ్గా ఉపయోగిస్తే.. అవి మానవ గుండె ఆరోగ్యానికి గొప్ప మేలు చేస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే దాని ప్రత్యేక పోషక ప్రయోజనాలను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ పాలను సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..