కర్ణాటక బీదర్ జిల్లాలోని హుమ్నాబాద్ తాలూకా బషీలాపూర్ గ్రామ సమీపంలోని 71 ఎకరాల భూమిలో తెలంగాణకు చెందిన సుధాకర్ వివిధ రకాల మామిడి పండ్లను పండిస్తూ ఏటా లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. సుధాకర్ మామిడి తోటలోని మామిడి పంటను అతిఫ్ అనే రైతు కోటి రూపాయలకు కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన మామిడికాయలను అమ్మి ఏడాదికి రెండు కోట్లకు పైగా లాభం పొందుతున్నాడు. ఈ తోటలో బంగిన పల్లి, చెరకు రసాలు, కలెక్టర్ మామిడి, మల్లిక, చిన్న రసాలు, పెద్ద రసాలు, సువర్ణరేఖ వంటి వివిధ రకాల మామిడి పండ్లు ఉన్నాయి. ఈ మామిడి పండ్లను మామిడి ప్రియులు ఇష్టపడుతున్నారు.
ప్రతిరోజూ 20 మందికి పైగా కార్మికులు మామిడికాయలను కోసి ఫ్యాక్స్ చేసి హైదరాబాద్ కు పంపుతున్నారు. హైదరాబాద్ లో నాణ్యమైన మామిడి పండ్ల ఎంపిక చేసి విదేశాలకు ఎగుమతి చేస్తామని ఉద్యానవన శాఖ అధికారి సంతోష్ చెబుతున్నారు.
బీదర్ జిల్లాలోని నేలలు మామిడి సాగుకు అనువైన నేలలు, మంచి వాతావరణం ఉందని బీదర్ ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి జనవరి వరకు 65%మామిడి మొక్కలు పూలు పూశాయని వర్షాలు కురవక పోవడంతో పాటు మంచు కురవకపోవడంతో మంచి పంట చేతికొస్తుందని వెల్లడించారు. అంతేకాదు ఇప్పటి వరకు మామిడి పంటకు ఎలాంటి వ్యాధులు, తెగుళ్లు సోకలేదు. దీనికితోడు ఏటా విజృంభించే మ్యాంగో హ్యాపర్ వ్యాధి ఈసారి కనిపించలేదు. ఈ పరిస్తితులన్నీ రైతుకు వరంగా మారినట్లు పేర్కొన్నారు.
మామిడి మొక్కలకు సాధారణంగా డిసెంబరు చివరి వారం, జనవరి మొదటి వారంలో పూత వస్తుంది. ఏప్రిల్, మే నెలాఖరు నాటికి పంట చేతికి వచ్చి మార్కెట్‌కు చేరుకుంటుంది. సుధాకర్ పండించిన మామిడి విదేశాలకే కాకుండా మైసూరు, బెంగళూరు, మంగళూరు, పుణె, ముంబై సహా పొరుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు కూడా వెళ్లడం విశేషం.
తోట మొత్తాన్ని ఏడాది పాటు లీజుకు ఇస్తున్నందున యజమాని సుధాకర్‌కు లాభ నష్టాల సమస్య లేదు. అంతేకాకుండా లీజుకు తీసుకున్న అతిఫ్ కూడా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఈ రైతులు బంజరు భూమిలో మామిడి సాగుతో ఏటా రెండు కోట్లకు పైగా లాభం పొందుతున్నారు. ఒకే రకం పండ్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని రకాల మామిడి పండ్లను పండించి విదేశాలకు పండ్లను ఎగుమతి చేయడం వలన ఎక్కువ లాభాలు పొందడంతో ఈ రైతు అందరికంటే భిన్నంగా లాభాలను ఆర్జిస్తున్నాడు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..