Hair Care: చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? ఓసారి ఇలా చేయండి.. పక్కా రిజల్ట్ ఉంటుంది..!
తలపై వచ్చే చుండ్రు చాలా మందికి కలిగే సాధారణ సమస్య. దీనిని మందులతో కాకుండా ఇంట్లోనే దొరికే సహజ పదార్థాలతో క్రమంగా తగ్గించవచ్చు. కొబ్బరి నూనె, నిమ్మరసం, వేప ఆకులు, పెరుగు వంటి పదార్థాలు సహజంగా చుండ్రును నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

తలపై చుండ్రు తగ్గించడానికి ఇంట్లోనే దొరికే సహజ పదార్థాలతో కొన్ని సులభమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా చుండ్రు సమస్యను సహజంగా నియంత్రించవచ్చు. తలపై చుండ్రును తగ్గించాలంటే.. కొబ్బరి నూనెకు కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు నెమ్మదిగా పట్టించండి. ఇది చర్మాన్ని శుభ్రం చేస్తూ.. ఫంగస్ ను తొలగించడంలో సహాయపడుతుంది. అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ శుభ్రం చేస్తుంది.
ఒక కప్పు పెరుగులో టీ స్పూన్ మిరియాల పొడి కలిపి చుండ్రు ఉన్న తల ప్రాంతంలో పట్టించండి. 20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయండి. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం, మిరియాలలోని యాంటీ ఫంగల్ గుణాలు కలిసి తల చర్మాన్ని శుభ్రం చేసి చుండ్రును తగ్గిస్తాయి.
తాజా వేప ఆకులను మెత్తగా నూరి పేస్ట్ చేసి తలకు అప్లై చేయండి. అరగంట తర్వాత తల స్నానం చేయండి. వేపలో ఉన్న యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును నివారించడంలో సహాయపడతాయి.
ఒక చెంచా మెంతులను రాత్రి నానబెట్టి.. ఉదయం వాటిని మెత్తగా నూరి తలకు రాయండి. కొద్దిసేపు ఆ తర్వాత తలస్నానం చేయండి. మెంతులలోని నికోటినిక్ యాసిడ్ తల చర్మాన్ని శుభ్రంగా ఉంచి.. చుండ్రును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
కలబంద గుజ్జును నేరుగా తలపై రాసి 30 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది తల చర్మాన్ని తేమగా ఉంచుతుంది, దురద తగ్గిస్తుంది. కలబందలోని శీతలత గుణాలు చర్మంపై ఫంగస్ పెరగకుండా చూస్తాయి.
తులసి, వేప ఆకులను సమపాళ్లలో తీసుకొని నూరి పేస్ట్ చేసి తలకు అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత తలస్నానం చేయండి. ఈ రెండు ఆకుల గుణాలు కలిసి చుండ్రు సమస్యను త్వరగా నియంత్రిస్తాయి.
రెండు చెంచాల ఉసిరిపొడిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు రాయండి. అరగంట తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి తల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
తలకు కొద్దిగా వేడి చేసిన నూనెతో నెమ్మదిగా మర్దన చేయడం వల్ల చుండ్రు తగ్గే అవకాశం ఉంది. బాదం నూనె, ఆముదం నూనె లేదా కొబ్బరి నూనె వంటివి ఉపయోగించటం ద్వారా తల చర్మానికి కావాల్సిన పోషణ అందుతుంది. ఇది చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
తరచుగా తలపై ఉల్లిపాయ రసం రాసినట్లయితే చుండ్రు తగ్గుతుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు తల చర్మాన్ని శుభ్రపరచి సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి.
(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే తలకు వాడాలి)




