
వంటగదిని శుభ్రంగా ఉంచుకున్నట్లే, వంట చేయడానికి ఉపయోగించే పాత్రలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ప్రతిరోజూ వంట చేయడం వల్ల, మీరు ఎంత శుభ్రం చేసినా కొన్ని పాత్రలపై నూనె మొండి మరకలు, నల్లటి పొర అలాగే ఉంటాయి. ఇది పాత్ర అందాన్ని పాడు చేస్తుంది. ఈ మరకలను తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదు. అయితే మీరు అరటి తొక్కతో ఎప్పుడైనా పాత్రలు కడిగారా? వీటిని ఉపయోగించి పాత్రలపై అంటుకున్న మరకలను సులభంగా తొలగించవచ్చు. అరటి తొక్కలను ఉపయోగించి పాత్రలపై అంటుకున్న మొండి మరకలను ఎటువంటి ఖర్చు లేకుండా సులభంగా ఎలా తొలగించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..
అరటి తొక్కలోని తెల్లటి లోపలి భాగంలో పొటాషియం, కొన్ని సహజ నూనెలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పాత్రలపై మురికిని తొలగించడంలో సహాయపడతాయి. స్టీల్ లేదా నాన్-స్టిక్ పాత్రలలో మాడిన మొండి మరకలు ఉంటే, వాటిని తొలగించడానికి అరటి తొక్క లోపలి భాగాన్ని పాత్రపై రుద్ది 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి స్క్రబ్బర్‌తో శుభ్రం చేయండి. అలాగే అరటి తొక్కపై కొంత టూత్‌పేస్ట్‌ను అప్లై చేసి కూడా పాత్రలను స్క్రబ్ చేయవచ్చు.
అరటి తొక్కలలో పొటాషియం, భాస్వరం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. తొక్కలను చిన్న ముక్కలుగా కోసి మట్టిలో పాతిపెట్టాలి. లేదా నీటిలో మరిగించి మొక్కలకు ఈ నీళ్లు పోయాలి. ఇది మొక్కలను పచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది.
లెదర బూట్లు, పర్సులు,బెల్టులు కాలక్రమేణా వాటి మెరుపును కోల్పోతాయి. కాబట్టి అరటి తొక్క లోపలి భాగాన్ని బూట్లపై రుద్ది, ఆపై పొడి గుడ్డతో పాలిష్ చేయండి. ఇది తోలు వస్తువులకు సహజ మెరుపును తిరిగి తెస్తుంది.
అరటి తొక్కలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని పోషిస్తాయి. మొటిమలు, పొడి చర్మంతో బాధపడేవారు తొక్క లోపలి భాగాన్ని సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ముఖం కడిగేయాలి. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
వెండి పాత్రలు మసకబారినా, ఉక్కు పాత్రలు వాటి మెరుపును కోల్పోయినా అరటి తొక్కను ఆ పాత్రలపై రుద్ది, నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇది మెరుపును తిరిగి తెస్తుంది.
మరిన్నిఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.