
అరటి పండు తిన్నాక మిగిలిపోయే తొక్కను చాలా మంది విసిరేస్తారు. కానీ అదే తొక్క జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. సరైన రీతిలో వాడితే ఇది జుట్టు రాలడాన్ని తగ్గించటమే కాకుండా కొత్త జుట్టు పెరగడంలో సహాయపడుతుంది. ఆరోగ్యంగా జుట్టు పెరగాలంటే దీన్ని ఉపయోగించడం మంచిది.
పండిన అరటి తొక్క – 1, కొబ్బరి నూనె – 1 టీస్పూన్, తేనె – 1 టీస్పూన్. ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాలు ఉంచాలి. తర్వాత తల శుభ్రంగా కడగాలి. ఇది తలకు పోషణ అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
అరటి తొక్క – 1, నీరు – 2 కప్పులు. అరటి తొక్కను నీటిలో 10 నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత ద్రవాన్ని వడకట్టాలి. ఈ నీటిని చల్లార్చి తల కడిగిన తర్వాత చివరిగా తలపై పోయాలి. ఇది తల చర్మాన్ని తేమగా ఉంచుతుంది. జుట్టు మెత్తగా మారుతుంది.
అరటి తొక్క – 1, కొబ్బరి లేదా ఆలివ్ నూనె – అర కప్పు. ఒక చిన్న పాత్రలో నూనె వేడి చేయాలి. అందులో తొక్క వేసి 10 నిమిషాలు మరిగించాలి. మరిగిన తరువాత వడకట్టి ఒక సీసాలో నిల్వ చేయాలి. ఈ నూనెను తలకు అప్లై చేసి అరగంట తర్వాత తల కడిగితే జుట్టు కాంతివంతంగా మారుతుంది.
మీ తల చర్మం సున్నితంగా ఉంటే.. ఈ నూనెను మొదట కొద్దిగా పరీక్షించి చూడటం మంచిది. ఈ నూనెను ఉపయోగించే ముందు చల్లబరచాలి. సాధారణంగా వారానికి ఒక్కసారి ఈ నూనెను వాడితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం లేదు.
కేవలం అరటి తొక్కతో ఇంట్లోనే తక్కువ ఖర్చుతో జుట్టు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దీనిలో రసాయనాలు లేవు, సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు. కొద్దికాలం పాటు క్రమంగా వాడితే జుట్టులో మంచి మార్పు కనిపిస్తుంది.
ఈ పదార్థాలు సహజమైనవే అయినా.. కొందరికి అలెర్జీ, అసహనం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు తలకు ఉపయోగించే ముందు.. మొదట చేతి వెనుక లేదా చెవి కింద భాగంలో కొంచెం మిశ్రమాన్ని రాసి కొంత సమయం వరకు గమనించండి. ఎరుపు, దురద, మంట లాంటి అలర్జీ లక్షణాలు ఏవి కనిపించినా ఇది వాడకూడదు.