Male Fertility Age: పురుషులు ఏ వయస్సులో తండ్రులు కావచ్చు? సైన్స్ చెప్పే ఉత్తమ వయస్సు ఇదే

సాధారణంగా సంతానోత్పత్తి గురించి మాట్లాడినప్పుడు మహిళల వయస్సుపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. రుతువిరతి తర్వాత మహిళలు సహజంగా తల్లులు కాలేరు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, పురుషుల విషయంలో మాత్రం “వృద్ధాప్యంలో కూడా తండ్రులు కావచ్చు” అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే, ఇది పూర్తిగా నిజం కాదు అని సైన్స్ చెబుతోంది.

Male Fertility Age: పురుషులు ఏ వయస్సులో తండ్రులు కావచ్చు? సైన్స్ చెప్పే ఉత్తమ వయస్సు ఇదే
Fatherhood

Updated on: Jan 24, 2026 | 3:24 PM

Male Reproductive Health: గతంలో చాలా మంది 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులోనే వివాహాలు చేసుకునేవారు. కానీ, ఇటీవల కాలంలో 30 ఏళ్లు వచ్చినప్పటికీ.. వివాహాలు చేసుకునే ఆలోచనే చేయడం లేదు. జీవితంలో స్థిరపడ్డాకే వివాహం చేసుకోవాలని కొందరు.. సంబంధాలు దొరక్క మరికొందరు.. ఇంకొందరు పెళ్లిపై అయిష్టతతో వివాహాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో 30-35 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటే పిల్లల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సంతానోత్పత్తి గురించి మాట్లాడినప్పుడు మహిళల వయస్సుపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. రుతువిరతి తర్వాత మహిళలు సహజంగా తల్లులు కాలేరు అనే విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా ఇది 50 సంవత్సరాల వయస్సు దగ్గర జరుగుతుంది. కానీ, పురుషుల విషయంలో మాత్రం “వృద్ధాప్యంలో కూడా తండ్రులు కావచ్చు” అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే, ఇది పూర్తిగా నిజం కాదు అని సైన్స్ చెబుతోంది.

పురుషుల సంతానోత్పత్తి వయస్సుతో ఎలా మారుతుంది?

శాస్త్రవేత్తల ప్రకారం.. పురుషులు కౌమారదశ తర్వాత స్పెర్మ్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. సాంకేతికంగా జీవితాంతం వరకు స్పెర్మ్ ఉత్పత్తి కొనసాగుతుంది. అందువల్ల పురుషులు 60, 70 లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో కూడా తండ్రులు కావడం సాధ్యమే. కానీ, అన్ని వయస్సులలో స్పెర్మ్ నాణ్యత ఒకేలా ఉంటుందని దీని అర్థం కాదు.

వయస్సు పెరిగే కొద్దీ.. స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. స్పెర్మ్ కదలిక (motility) తగ్గుతుంది. స్పెర్మ్ DNA నాణ్యత క్షీణిస్తుంది. పరిశోధనల ప్రకారం.. 30 ఏళ్ల తర్వాత పురుషుల సంతానోత్పత్తిలో స్వల్ప మార్పులు మొదలవుతాయి. 40 సంవత్సరాల తర్వాత ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వయస్సు తర్వాత తండ్రి కావడం ఎక్కువ సమయం పట్టవచ్చు.

తండ్రి కావడానికి ఉత్తమ వయస్సు ఏది?

సైన్స్ ప్రకారం, పురుషులు తండ్రులు కావడానికి 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు అత్యుత్తమంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో.. స్పెర్మ్ నాణ్యత మెరుగ్గా ఉంటుంది. జన్యు లోపాల ప్రమాదం తక్కువగా ఉంటుంది. సహజ గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ), Your Fertility Australia వంటి సంస్థల నివేదికల ప్రకారం.. 35 ఏళ్లలోపు మహిళలు, 40 ఏళ్లలోపు పురుషులు తల్లిదండ్రులు కావడం సురక్షితమైనదిగా, సులభమైనదిగా భావించబడుతుంది. సహజ గర్భధారణ అయినా, IVF వంటి పద్ధతులైనా, ఈ వయస్సు దాటిన తర్వాత సంతానోత్పత్తి అవకాశాలు క్రమంగా తగ్గుతాయి.

40 ఏళ్ల తర్వాత తండ్రి కావడం ఎందుకు సవాలుగా మారుతుంది?

40–50 సంవత్సరాల తర్వాత పురుషులు తండ్రులు కావడం పూర్తిగా అసాధ్యం కాకపోయినా, కొన్ని ప్రమాదాలు పెరుగుతాయి.. గర్భధారణకు ఎక్కువ సమయం పట్టడం, స్పెర్మ్‌లో జన్యు ఉత్పరివర్తనల (genetic mutations) ప్రమాదం పెరగడం, పిల్లల్లో ఆటిజం, స్కిజోఫ్రెనియా వంటి వ్యాధుల ప్రమాదం పెరగవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువల్ల, పెద్ద వయస్సులో తండ్రి కావడం పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

జీవనశైలి ప్రభావం ఎంతవరకు ఉంటుంది?

వయస్సుతో పాటు జీవనశైలి కూడా పురుషుల సంతానోత్పత్తిపై కీలక పాత్ర పోషిస్తుంది. నిపుణుల ప్రకారం.. ధూమపానం, మద్యం సేవనం,
ఊబకాయం, అధిక ఒత్తిడి, నిద్రలేమి, అసమతుల్య ఆహారం.. ఇవన్నీ స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తాయి. అయితే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని నియంత్రించడం వంటివి వయస్సు పెరిగినా సంతానోత్పత్తిని కొంతవరకు కాపాడగలవు.

మొత్తానికి, పురుషులకు తండ్రి కావడానికి ఖచ్చితమైన వయోపరిమితి లేకపోయినా.. వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదాలు మాత్రం తప్పకుండా పెరుగుతాయి. ఒక పురుషుడు తండ్రి కావాలని ప్రణాళిక వేసుకుంటే, 35–40 సంవత్సరాల మధ్య తండ్రి కావడం సురక్షితమైన, తెలివైన నిర్ణయంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.