
ఆయుర్వేదంలో అర్జున చెట్టు బెరడు గుండె ఆరోగ్యానికి ఒక దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. రోజూ ఉదయాన్నే అర్జున బెరడు పొడిని నీళ్లలో లేదా పాలలో మరిగించి కషాయంలా తయారు చేసుకుని తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. గుండె కండరాలను బలోపేతం చేయడానికి, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా చూడటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అర్జున బెరడులో ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తనాళాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అర్జున బెరడు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో తోడ్పడుతుంది. ఇది రక్తనాళాలను సడలించి, రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది. దీనివల్ల అధిక రక్తపోటు అదుపులోకి వచ్చి గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. అర్జున కషాయం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె కండరాలు బలంగా మారతాయి. ఫలితంగా గుండె పంపింగ్ సామర్థ్యం పెరుగుతుంది. రక్తనాళాలలో ఫ్లేక్స్ ఏర్పడకుండా ఇది నిరోధిస్తుంది. దీని ద్వారా హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని నివారించవచ్చు.
అర్జున టీ లేదా కషాయం: ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ అర్జున బెరడు పొడి వేసి, నీరు సగానికి తగ్గే వరకు బాగా మరిగించాలి. దీనిని వడకట్టి ఉదయాన్నే పరగడుపున తాగాలి. రుచి కోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.
పాలతో తీసుకోవడం: ఒక గ్లాసు పాలలో అర టీస్పూన్ అర్జున పొడి వేసి మరిగించి, రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
అర్జున బెరడు ప్రకృతిసిద్ధమైనదే అయినప్పటికీ, ఇప్పటికే గుండె జబ్బులకు లేదా రక్తపోటుకు మందులు వాడుతున్నవారు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకున్న తర్వాతే దీనిని తమ ఆహారంలో భాగం చేసుకోవడం శ్రేయస్కరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..