ఉసిరి vs నిమ్మకాయ.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..? దేనిలో విటమిన్ సి ఎక్కువ..
Amla vs Lemon: వంటింట్లో సులభంగా లభించే సిట్రస్ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సంజీవనిలా పనిచేస్తాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలో దివ్యౌషధాలుగా పేరుగాంచిన ఉసిరి, నిమ్మకాయలలో ఆరోగ్యానికి ఏది అత్యంత శక్తివంతమైనది అనే చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కొవ్వు కరిగించి బరువు తగ్గించడంలో నిమ్మకాయ ముందా.. చర్మ సౌందర్యం, షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో ఉసిరి తోపా? ఈ రెండింటి పోషక విలువల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

యవ్వనంగా, అందంగా, ఎలాంటి రోగాలు దరిచేరకుండా జీవించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం ఖరీదైన మందులు, సప్లిమెంట్ల కంటే మన వంటింట్లో లభించే సిట్రస్ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే నిమ్మజాతి పండ్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఉసిరి, నిమ్మకాయలలో ఆరోగ్యానికి ఏది బెస్ట్? విటమిన్ సి దేనిలో ఎక్కువగా ఉంటుంది? ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ సి పోరు: ఉసిరి vs నిమ్మకాయ.. దేంట్లో ఎక్కువ?
చాలామంది నిమ్మకాయలోనే విటమిన్ సి అత్యధికంగా ఉంటుందని భావిస్తారు. కానీ వాస్తవానికి నిమ్మకాయ కంటే ఉసిరిలోనే విటమిన్ సి విపరీతంగా ఉంటుంది. ఒక మధ్యస్థ పరిమాణపు నిమ్మకాయలో సుమారు 30 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. అదే ఒక మధ్యస్థ పరిమాణపు ఉసిరికాయలో ఏకంగా 300 నుంచి 400 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అంటే నిమ్మకాయతో పోలిస్తే ఉసిరిలో విటమిన్ సి దాదాపు 10 నుంచి 20 రెట్లు ఎక్కువ. నారింజ, బత్తాయి వంటి ఇతర పండ్ల కంటే కూడా ఉసిరిలోనే విటమిన్ సి అత్యధికం. ప్రతిరోజూ కేవలం ఒకే ఒక్క ఉసిరికాయ తింటే శరీరానికి అవసరమైన రోజువారీ విటమిన్ సి కోటా పూర్తిగా సమకూరుతుందని ఆయుర్వేద వైద్యురాలు చంచల్ శర్మ స్పష్టం చేస్తున్నారు.
ఉసిరితో కలిగే అద్భుత ప్రయోజనాలు
ఆయుర్వేదంలో ఉసిరిని దివ్యౌషధంగా పరిగణిస్తారు. ఇందులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా రోగనిరోధక వ్యవస్థను ఉక్కులా మారుస్తాయి. శరీరంలో కొవ్వు నిల్వలను కరిగించడంలో, కొవ్వు జీర్ణం కావడంలో ఉసిరి సాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది. చర్మంపై ముడతలు రాకుండా వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేస్తుంది. కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని అరికడుతుంది. కంటి ఆరోగ్యానికి, కంటిచూపు స్పష్టతకు ఉసిరి అత్యంత మేలు చేస్తుంది.
నిమ్మకాయ ఎందుకు తప్పనిసరి?
విటమిన్ సి పరంగా ఉసిరి కంటే తక్కువగా ఉన్నప్పటికీ, నిమ్మకాయ శరీరానికి అందించే ప్రయోజనాలు తక్కువేమీ కాదు. శరీరంలోని వ్యర్థాలు, హానికర టాక్సిన్లను బయటకు పంపడంలో నిమ్మరసం సాటిలేనిది. నిమ్మరసం జీవక్రియను వేగవంతం చేసి, బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో, బరువు తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలను తక్షణమే నివారిస్తుంది. నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా వెంటనే రీఫ్రెష్ అవుతుంది.
ఏది ఎంచుకోవాలి?
శరీరంలో విటమిన్ సి లోపాన్ని అధిగమించడానికి, కణాల పునరుత్పత్తికి, యాంటీ-ఏజింగ్ కోసం ఉసిరి తిరుగులేని ఎంపిక. అదే సమయంలో జీర్ణవ్యవస్థను శుద్ధి చేయడానికి, బరువు తగ్గడానికి, తక్షణ శక్తి కోసం నిమ్మకాయ ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తీసుకోవడం లేదా రోజువారీ ఆహారంలో ఒక ఉసిరికాయను భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
