AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ మరింత అందంగా : హోలీ వేళ లంబాడీ, ఆదివాసుల రంగుల వేడుకలు.. ఆదిలాబాద్ జిల్లా అడవులకే అందానిస్తున్నాయ్..

Adilabad Tribes India Holi Organic Colours : హోలీ పండుగ వచ్చిదంటే చాలు ఆదిలాబాద్ అడవుల్లో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. గిరిజనులు ఆడే ఆటపాటలు లంబాడీ, ఆదివాసుల రంగుల వేడుకలు..

అక్కడ మరింత అందంగా : హోలీ వేళ లంబాడీ, ఆదివాసుల రంగుల వేడుకలు..  ఆదిలాబాద్ జిల్లా అడవులకే అందానిస్తున్నాయ్..
Venkata Narayana
|

Updated on: Mar 28, 2021 | 10:47 PM

Share

Adilabad Tribes  Holi Organic Colours : హోలీ పండుగ వచ్చిదంటే చాలు ఆదిలాబాద్ అడవుల్లో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. గిరిజనులు ఆడే ఆటపాటలు లంబాడీ, ఆదివాసుల రంగుల వేడుకలు అడవికే అందానిస్తుంది. అడవులతోనే మమేకమైన ఆదివాసుల సహజమైన జీవనశైలికి దురాడీ కోబ్రె (కుడుకుల) పండగ అద్దం పడుతుంది. ఆదిమ గిరిజన గూడాల్లో అట్టహాసంగా జరుగుతున్న ఈ పండుగను రంగుల పున్నమిగా భావిస్తారు. లంబాడీలు ఘనంగా జరుపుకునే ఢూండ్‌ మరింత అట్టహాసంగా ఆకట్టుకుంటోంది.

హోళి పండుగ గిరిజనుల అభిమాన పండుగ. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో ఆదివాసీలు, లంబాడాలు అత్యంత ఉత్సాహంగా జరుపుకునే ప్రకృతి పండుగ. ఈ పండుగకు వారు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఫాల్గుణ మాసం చంద్ర దర్శనం మొదలుకొని ఫాల్గుణ శుక్ల పౌర్ణమి వరకు వెన్నెల రాత్రుల్లో ఆడే ఆట పాట కొట్లాట అన్ని కొత్తగానే దర్శనమిస్తాయి. పండుగకు నెల ముందు నుంచే ప్రకృతిలో దొరికే ఆకులు, అలములు, గోగు పూలను తెచ్చి రంగుల్ని తయారుచేసుకుంటారు. పచ్చని ప్రకృతిలో లభించే స్వచ్చమైన గోగుపూల నుండి తీసిన రంగులతోనే హోళీ పండుగ జరుపుకోవడం గిరిజనుల తరతరాల సంప్రదాయం. హోళీ పండుగ జరుపుకోవడంలో ఆదివాసీల ఆచారం విభిన్నం. గ్రామ పటేల్ , దేవాలరికి కుడక ఇస్తేనే గూడెంలో కొనసాగుతున్నట్టు లెక్క, లేదంటే.. ఆ వ్యక్తులు ఆ కుటుంబాలు గూడెంతో ఎలాంటి సంబందాలు లేవని భావిస్తారు‌. దీనినే దురాడీ కోబ్రే ( కుడుకల ) పండుగ అని పిలుస్తారు ఆదివాసీ గిరిజనులు.

హోలీ పండుగ వేళ ఆదివాసులు ఈ దురాడీ కోబ్రె పండుగను మూడ్రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. పున్నమికి ఒకరోజు ముందు, ఆ తర్వాత రోజు కూడా ఉత్సవాలు జరుపుతారు. ఈ సమయంలో తమ ఆరాధ్య దైవంగా భావించే “మాతరి”, “మాత్రే “లను ఘనంగా పూజిస్తారు. అందులో భాగంగా సంప్రదాయబద్ధంగా వాయిద్యాల నడుమ దేవతలను ఆదివాసులు తమ ఇంటికి తీసుకెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. గూడాల్లో ఇల్లిల్లు తిరిగిన అనంతరం మాతరే, మాత్రే దేవతలను గ్రామ పొలిమేరలకు తీసుకువెళ్తారు. ఆ తర్వాత గూడెంలో ఉండే వాళ్లంతా ఒక్కొక్కరు ఒక కుడుక తీసుకువెళ్లి గ్రామ పటేల్ కు ఇస్తారు. అలా ఆరోజు ఆయన వద్దకు ఎన్ని కుడుకలు వస్తే ఆ గూడెంలో అంత జనాభా ఉన్నట్టు పరిగణిస్తారు. తన వద్దకు వచ్చే వారందరికీ పటేల్ చక్కరి పేర్లను ఇచ్చి రంగుల పున్నమి శుభాకాంక్షలు తెలుపుతారు.

మాతారి మాతరల్‌ కాముని దహనం చేసిన బూడిదను ఇతరులు దొంగలించకుండా ఉండడానికి ప్రత్యేకంగా జాగరణ చేస్తారు. ఇతర గ్రామస్తులు ఈ బూడిదను దొంగలించే ప్రయత్నం చేస్తారు. ఇది వారి ఆచారంలో ఓ భాగం. కాముడి బూడిదను తీసుకెళ్లి తమతమ ఇళ్ల ముఖద్వారం ఎదుట చల్లుతారు. ఇలా చల్లడం వల్ల బయట శక్తులు ఇళ్లలోకి ప్రవేశించవని ఆదివాసీల అపారా నమ్మకం. ఆదివాసీల హోళీ అలా సాగితే గిరిజనుల్లోని లంబాడా సామాజిక వర్గంలో హోళీ మరింత విభిన్నంగా సాగుతుంది. ఓ వైపు పురుషులు.. మరోవైపు మహిళలు.. ఇద్దరి చేతుల్లో కర్రలు. ఇదేదో సంకుల సమరం కాదు. సంప్రదాయ గిరిజన హోలీ వేడుకల్లో ఒక దృశ్యం. పూర్వం గిరిజనుల్లో నేనావత్‌ వర్గానికి సంతానం కలగకపోవడంతో వారు హోలీ దేవతను మొక్కుకున్నారని.. అప్పుడు పిల్లలు పుట్టారని గాథ. నాటి నుంచి వీరు హోలీ వేడుకలు ఇలా ఘనంగా జరుపుకొంటారు. గుడారాలు వేసి వాటి ముందు కడావ్‌ (కడాయి) పెట్టి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీస్తారు. కడావ్‌ను ఎత్తుకెళ్లేందుకు మగవారు వస్తే.. వారిని అడ్డుకొనేందుకు మహిళలు కర్రలతో దాడులు చేస్తారు.

అటు ఆదివాసీల ఆటపాటలు ఇటు లంబాడాల నృత్యాలు అడవుల జిల్లాలో కన్నుల పండుగగా కనిపిస్తాయి. సుఖదు:ఖాల్ని పంచుకొనే ఏకత గిరిజనుల్లో మాత్రమే కనిపిస్తుందనడానికి ఈ వేడుకలే నిదర్శనం. ఆధునిక సమాజానికి ఆదివాసీల సంప్రదాయం ఎన్నటికీ దీక్షూచే.

Read also : సీఎం పళనిస్వామిపై నీచమైన వ్యాఖ్యల ప్రతిఫలం, తమిళనాట ఆగ్రహజ్వాలలు.. మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఎ రాజాపై కేసు