
హర్యానాకు చెందిన సౌరభ్ మిట్టల్ అనే 25 ఏళ్ల యువకుడు ఎన్ఐటీ కురుక్షేత్ర (NIT Kurukshetra) నుండి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తన 22 ఏళ్ల చిన్న వయసులోనే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం సాధించారు. అప్పట్లో ఆయనకు లభించిన వార్షిక ప్యాకేజీ అక్షరాలా 19 లక్షల రూపాయలు. ఇంతటి భారీ జీతంతో కూడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందుకు ఆ కుటుంబం ఎంతో సంతోషించింది. కానీ, సంస్థలో అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఉన్న చేదు నిజాలు ఆయన ఊహకు అందలేదు. కొన్ని సంవత్సరాల పాటు ఆ నరకాన్ని భరించిన తర్వాత, ఇక తన వల్ల కాదంటూ ఆయన ఉద్యోగాన్ని వదిలేశారు.
సౌరభ్ మిట్టల్ తెలిపిన వివరాల ప్రకారం.. బయటకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కనిపించే ఈ ఉద్యోగంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. ఆయన పనిచేసిన వేర్‌హౌస్ (గోదాము) లో కనీసం సరిగ్గా వాడుకోవడానికి టాయిలెట్ వసతి కానీ, తాగడానికి శుభ్రమైన నీటి సౌకర్యం కానీ లేవని ఆరోపించారు. ఆఫీసులోని చాలా వస్తువులు పాడైపోయినప్పటికీ, వాటి గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి పని సంస్కృతి ఎంతో పాతకాలపు పద్ధతిలో, ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా, సీనియర్ అధికారులు తమ వ్యక్తిగత పనులను కూడా జూనియర్ ఉద్యోగులతో బలవంతంగా చేయించేవారని సౌరభ్ ఆరోపించారు. అధికారుల కోసం ఎయిర్‌పోర్ట్ పికప్‌లు చేయడం, హోటల్ రూమ్ బుకింగ్స్ చూసుకోవడం వంటి వ్యక్తిగత పనుల కోసం ఒత్తిడి తెచ్చేవారని తెలిపారు. ఆఫీసు సమయం ముగిసిన తర్వాత కూడా అర్ధరాత్రి వేళల్లో, వీకెండ్స్‌లో (శని, ఆదివారాలు) నిరంతరం ఫోన్ కాల్స్ చేస్తూ టార్చర్ పెట్టేవారని వివరించారు. ఈ ఒత్తిడి చాలదన్నట్లు, కనీసం అత్యవసర పరిస్థితుల్లో సెలవులు అడిగినా ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టేవారని, జీతాల పెంపు మరియు ప్రమోషన్లు ఎంతో నెమ్మదిగా సాగేవని పేర్కొన్నారు.
తక్కువ వయసు ఉన్న ఉద్యోగులకు, పాత తరం అధికారులకు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ వల్ల కూడా ఎలాంటి కెరీర్ గ్రోత్ కనిపించలేదని సౌరభ్ చెప్పారు. తన జీవితాంతం ఇలాంటి బానిసత్వ వాతావరణంలో గడపలేనని గ్రహించి, మానసిక ప్రశాంతత కోసం రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అయితే, భారతదేశంలో మిగతా మధ్యతరగతి కుటుంబాల లాగే, చేతికొచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవడం సౌరభ్ ఇంట్లో పెద్ద గొడవకు దారితీసింది. సెక్యూరిటీ ఉండే ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నావని తండ్రి తీవ్రంగా మందలించారు. కానీ, కొడుకు పడుతున్న మానసిక వేదనను, అనుభవిస్తున్న స్ట్రెస్‌ను కళ్లారా చూసిన తల్లి మాత్రం అతనికి పూర్తి మద్దతుగా నిలిచింది.
ఈ కథనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వేల సంఖ్యలో లైకులు, కామెంట్లతో వైరల్‌గా మారింది. ఎంతోమంది యువ ఉద్యోగులు సౌరభ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, తాము కూడా వివిధ సంస్థలలో ఇలాంటి దారుణమైన పని సంస్కృతినే ఎదుర్కొంటున్నామని తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఎంత పెద్ద జీతం ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే.. మనిషికి మానసిక ఆరోగ్యం మరియు ఆత్మగౌరవం కంటే ఏదీ ఎక్కువ కాదని ఈ ఘటన నిరూపిస్తోంది. నేటి యువత కేవలం సంపాదన కోసమే కాకుండా, తమ వెల్‌బీయింగ్ మరియు మెంటల్ హెల్త్‌కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ హర్యానా ఇంజనీర్ నిర్ణయం స్పష్టం చేస్తోంది.