జగన్ అనే నేను.. అంటూ నవ్యాంధ్ర రెండో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే సమయం ఆసన్నమైంది. మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఆయనతో గవర్నర్ నరసింహన్ సీఎంగా ప్రమాణం చేయిస్తారు. జాతీయ, రాష్ట్ర నాయకులతో పాటు వేలది ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు జగన్ వేదిక దగ్గరకు చేరుకుంటారు. ఆయన వెంట తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సహా పలువురు వేదిక మీదకు వచ్చే అవకాశం ఉంది.
అయితే.. 30 వేల మంది స్టేడియంలో కూర్చునే ఏర్పాట్లు చేశారు అధికారులు. స్టేడియానికి ఆనుకొని, వెలుపల భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, జడ్జిలకు ఒక గ్యాలరీ, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మరో గ్యాలరీని కేటాయించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, ఇతర వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలున్నాయి. కొంతమంది ప్రజలకు స్టేడియం లోపల, చుట్టూ ఉండే గ్యాలరీల్లోకి అనుమతిస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం కోసం రెండు ప్రధాన స్టేజీలను ఏర్పాటు చేశారు.