కేరళా మజాకా.!
నేటి బాలలే రేపటి పౌరులు. ఇదే భారత భవిష్యత్తు. అలాంటి చిన్నారుల ఆయురారోగ్య పరిస్థితులు మరి దేశంలో ఎలా ఉన్నాయి? యంగ్ చైల్డ్ అవుట్‌కమ్స్ ఇండెక్స్(వైసీఓఐ) ఈ విషయాల్ని నిగ్గు తేల్చింది. ఈ గణాంకాల్లో ఆరేళ్లలోపు పిల్లల..

నేటి బాలలే రేపటి పౌరులు. ఇదే భారత భవిష్యత్తు. అలాంటి చిన్నారుల ఆయురారోగ్య పరిస్థితులు మరి దేశంలో ఎలా ఉన్నాయి? యంగ్ చైల్డ్ అవుట్‌కమ్స్ ఇండెక్స్(వైసీఓఐ) ఈ విషయాల్ని నిగ్గు తేల్చింది. ఈ గణాంకాల్లో ఆరేళ్లలోపు పిల్లల ఆరోగ్యంలో కేరళ ప్రథమ స్థానంలో నిలవగా బిహార్ అథమ స్ధానంలో ఉంది. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ఎదుగుదల అనే మూడు అంశాలతో పాటు, శిశు మరణాల రేటు, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఆయా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించారు. 2005-06 లోని ఫలితాలను 2015-16 నాటి ఫలితాలతో పోలుస్తూ ఈ నివేదికను రూపొందించారు. వైసీఓఐ నివేదికలో కేరళ, గోవా రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో ఉండగా అస్సాం, మేఘాలయ, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్ చివరి అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు వైసీఈఐ నివేదికలోనూ వెనకబడి ఉండటం గమనార్హం. 2005లో వెనకంజలో ఉన్న త్రిపుర కొంతమేర మంచి ఫలితాలు చూపించగలిగింది. కాగా దేశంలో ఉన్న 15.9 కోట్ల ఆరేళ్లలోపు చిన్నారుల్లో 21 శాతం మందిలో పోషకాహార లోపం, 36 శాతం మంది తక్కువ బరువుతో ఉండడం, 38 శాతం మందికి టీకాలు అందడం లేదని కూడా నివేదిక తెలుపుతోంది.



