వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశంపార్టీ సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ చేశారు మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. రాజధానుల వికేంద్రీకరణ బిల్లు సభ ఆమోదం పొందినట్లే అంటున్న వైసీపీ నేతలది కేవలం అవగాహనారాహిత్యం అని యనమల అన్నారు. సెలెక్ట్ కమిటీకి రాజధానుల బిల్లు పంపే వరకు ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని యనమల అన్నారు.
గురువారం మీడియాతో మాట్లాడిన యనమల.. ‘‘14 రోజులు ముగిసింది కనుక బిల్లులు పాస్ అయ్యాయని వైసీపీ నేతలు చెపుతున్నారు.. ఈ నిబంధన కేవలం మనీ బిల్లులకు మాత్రమే వర్తిస్తుంది.. జనరల్ బిల్లులకు వర్తించదు.. చైర్మన్ మీద ప్రివిలేజిషన్ నోటీస్ ఇస్తామని అంటున్నారు.. వైసీపీ నేతలకు రూల్స్ తెలియదు..చట్టాల పై అవగాహన లేదు’’ అని అన్నారు.
రాజధానుల వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపే వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదని యనమల అంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ వ్యూహం ఏంటో చూస్తారని యనమల సవాల్ చేశారు. బిల్లులు మండలికి రాకుండా పాస్ చేయించడం కుదరదని యనమల చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలు కేవలం సొంత పనుల కోసమేనని, రాష్ట్రం కోసమైతే ప్రధానితో భేటీ విషయాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు యనమల.