కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈ మహమ్మారిని ఎదుర్కునేందుకు అన్ని దేశాలు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాయి. అయితే లాక్ డౌన్ కారణంగా ప్రభత్వాలకు పూర్తి స్థాయిలో ఆదాయం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్…కరోనాతో ఇబ్బందిపడుతోన్నఅభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సాయంతో చేయూత అందించబోతుంది. ఇందులో భాగంగా 25 దేశాలకు 1.9 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. ఎమర్జెన్సీ ఫైనాన్సింగ్ ఫండ్‌లో భాగంగా ఇండియాకు రూ.7600 కోట్ల(1 బిలియన్ డాలర్లు)ను కేటాయించింది. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ ఎక్స్‌క్యూటివ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకున్నారు.
మెరుగైన స్క్రీనింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, లాబోరేటరీల ఏర్పాటు, డయాగ్నస్టిక్స్, ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు, ప్రయోగశాల విశ్లేషణలకు, పీపీఈల కొనుగోలుకు ఈ నిధులను వినియోగించనున్నారు. వరల్డ్ బ్యాంక్ ప్రకటించిన నిధుల్లో.. మన దాయాది పాకిస్తాన్‌కు 200 మిలియన్ డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్‌కు 100 మిలియన్ డాలర్లు, శ్రీలంకకు 128.6 మిలియన్ డాలర్ల, మాల్దీవ్స్‌కు 7.3 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని పొందనున్నాయి.