గుంటూరు యువతి మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

గుంటూరు యువతి మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

దారుణ హత్యకు గురైన యువతి మర్డర్ మిస్టరీని గుంటూరు జిల్లా పోలీసులు ఛేదించారు. 2018లో జరిగిన ఈ ఘాతుకంపై విచారణ జరిపిన పోలీసులు ఎట్టకేలకు హత్యగా నిర్ధారించారు.

Balaraju Goud

|

Nov 11, 2020 | 7:14 PM

దారుణ హత్యకు గురైన యువతి మర్డర్ మిస్టరీని గుంటూరు జిల్లా పోలీసులు ఛేదించారు. 2018లో జరిగిన ఈ ఘాతుకంపై విచారణ జరిపిన పోలీసులు ఎట్టకేలకు హత్యగా నిర్ధారించారు. విద్యార్థినిని చంపేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసిన కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అర్బన్‌ ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు.

పాత గుంటూరుకు చెందిన ఒక యువతిని 2009లో పాలిటెక్నిక్‌ చదువుతున్న క్రమంలో అదే కళాశాలలో చదువుతున్న అలీనగర్‌కు చెందిన షేక్‌ కరీం అలియాస్‌ నాగూర్‌ ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన కరీం తరుచూ వేధింపులకు పాల్పడుతుండటంతో భరించలేక అతనితో ప్రేమలో పడింది. అయితే, నగరంలోని ఓ టూవీలర్ షోరూంలో యువతి పని చేస్తున్న క్రమంలో అక్కడ రఫీ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానించిన కరీం ఆమెను ఉద్యోగం మాన్పించాడు.

ఇదే క్రమంలో 2018 మే 25న కళాశాలలో చదివిన స్నేహితురాలి వివాహం ఉందని యువతి కుటుంబ సభ్యులకు చెప్పించి బయటకు వచ్చేలా చేశాడు. పాతగుంటూరులో అద్దెకు తీసుకున్న ఇంటికి తీసుకెళ్లాడు. అయితే, తనను త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ ఆమె ఒత్తిడి చేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఇతరులతో సన్నిహితంగా ఉండే నిన్ను పెళ్లి చేసుకోనని కరీం నిక్కచ్చిగా చెప్పేశాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. కోపోద్రిక్తుడైన కరీం యువతి తలను గోడకేసి కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం గొంతు నులిమి హతమార్చాడు. గోడలను కోసే వాల్ కట్టర్ యంత్రంతో యువతి శరీరం, కాళ్లు, చేతులు ముక్కలుగా కోశాడు. చీకటి పడిన తర్వాత మూట కట్టి బైక్ పై సుద్దపల్లిడొంక దగ్గరలోని విజయశాంతినగర్‌లోని నిర్జన ప్రదేశంలోని చెట్టుపొదల్లో విసిరేశాడు. అక్కడి నుంచి ఎవరికి అనుమానం రాకుండా జారుకున్నాడు.

అయితే, ఆ మూటను పోలీసులు గుర్తిస్తే దొరికిపోతానని భావించి.. రెండు రోజుల తర్వాత పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. యువతి గురించి అడిగిన వారికి ఎవరినో ప్రేమించి వెళ్లిపోయిందని నమ్మబలికాడు. హత్య చేసిన తర్వాత యువతి శరీరం నుంచి వచ్చిన రక్తపు మరకలు, ఇతర ఆధారాలు లభించకుండా ప్రత్యేకమైన కెమికల్‌తో చెరిపివేశాడు. అయితే, మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని యువతి మృతదేహం లభించడంతో విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం బయటపడింది. కాలిపోయిన శరీరంలో అస్తిపంజరం తలభాగంపై గాయమవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చి పలు ఆధారాలను భద్రపరచడంతో కేసు ఛేదించడం సులభమయ్యిందని ఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఎస్పీ తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu