హైదరాబాద్ : తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా పడవచ్చని పేర్కొంది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. శనివారం కూడా పలు జిల్లాల్లో ఓ మాదిరి వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 37.5 మిల్లీమీటర్లు, వికారాబాద్ 22.3, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్‌లోని మైత్రివనంలో 20, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో 14.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా, పలు జిల్లాల్లో ఈదురు గాలులతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.
అలాగే ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల సోమవారం నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఈదురుగాలులు వీస్తూ, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించారు.