రైతు చట్టాలను కేంద్రం రద్దు చేసేలా చూస్తాం, అన్నదాతల గర్జన, పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

రైతు చట్టాలను కేంద్రం తప్పనిసరిగా రద్దు చేసేలా చూస్తామని అన్నదాతల సంఘాలు హెచ్చరించాయి. ఢిల్లీ బయట సింఘు బోర్డర్ లో ఆందోళన మొదలైనప్పటి నుంచీ ఇప్పటివరకు 20 మంది రైతులు మరణించారు.

రైతు చట్టాలను కేంద్రం రద్దు చేసేలా చూస్తాం, అన్నదాతల గర్జన, పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Edited By: Anil kumar poka

Updated on: Dec 16, 2020 | 10:39 AM

రైతు చట్టాలను కేంద్రం తప్పనిసరిగా రద్దు చేసేలా చూస్తామని అన్నదాతల సంఘాలు హెచ్చరించాయి. ఢిల్లీ బయట సింఘు బోర్డర్ లో ఆందోళన మొదలైనప్పటి నుంచీ ఇప్పటివరకు 20 మంది రైతులు మరణించారు. ఇందుకు ఈ నెల 20 వ తేదీని సంతాపదినంగా పాటిస్తామని, ప్రతి గ్రామంలోను సంతాప సభలు నిర్వహిస్తామని జగ్ జీత్ దలైవాల్ అనే రైతు సంఘ నాయకుడు తెలిపారు. కేంద్రానికి, తమకు మధ్య పోరాటం అంతిమ దశకు చేరుకుందని, తామేమీ చర్చలకు దూరంగా పారిపోవడంలేదని ఆయన చెప్పారు. మా డిమాండ్లకు పటిష్టమైన ప్రతిపాదనలతో కేంద్రం చర్చలకు రావాలన్నారు. నిరసనలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో వస్తున్న మహిళలకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

చిన్నపాటి రైతు సంఘాలు ఆందోళన విరమించి  తిరుగుముఖం పడుతున్నారని వచ్చిన వార్తలను వివిధ రైతు సంఘాలు తోసిపుచ్చాయి. తమది చరిత్రాత్మక ఆందోళన అని, ఏ రైతు సంఘమూ వెనక్కి వెళ్లలేదని పేర్కొన్నాయి. మా ఐక్యతను ఎవరూ భంగపరచలేరని తెలిపాయి. ఇలా ఉండగా రైతుల నిరసనలపై దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సాధ్యమైనంత త్వరగా వీరి నిరసనపై కేంద్రం నిర్ణయం తీసుకునేలా చూడాలని, ఇప్పటికే కోవిడ్ కారణంగా నగరంలో ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తాయని పలువురు పిటిషన్ దారులు కోర్టును కోరారు. అటు ప్రధాని మోదీ మాత్రం… రైతు చట్టాలు వారికి మేలు చేసేవే అంటున్నారు. విపక్షాలు అన్నదాతలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఈ విధమైన ఆలోచనలను అప్పటి ప్రభుత్వాలు చేయలేదా అని ఆయన ప్రశ్నించారు.   కాగా బుధవారం కూడా రైతు సంఘాలు సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోనున్నాయి.