బ్లాక్ మార్కెట్లో రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను అమ్ముతున్న వార్డ్ బాయ్ లు, అరెస్ట్ చేసిన పోలీసులు
దేశంలో కోవిడ్ రోగుల సంఖ్య పెరుతుండడం కొందరు బ్లాక్ మార్కెటీర్లకు కాసుల పంట పండిస్తోంది. వీరు కోవిడ్ చికిత్సలో వాడే మందులను అత్యధిక అధిక ధరలకు అమ్ముతున్నారు...

దేశంలో కోవిడ్ రోగుల సంఖ్య పెరుతుండడం కొందరు బ్లాక్ మార్కెటీర్లకు కాసుల పంట పండిస్తోంది. వీరు కోవిడ్ చికిత్సలో వాడే మందులను అత్యధిక అధిక ధరలకు అమ్ముతున్నారు. యూపీలోని మీరట్ లో ఇద్దరు వార్డు బాయ్ లు రెమ్ డెసివిర్ ఇంజక్షన్లనుఒక్కొక్కటి 25 వేల రూపాయలకు చొప్పున అమ్మారు. ఇక్కడి సుభార్తి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చెందిన వీరు ఈ ఇంజక్షన్లను ఇంత రేటుకు అమ్మారని, వారిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. నిజానికి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోగులకు మాత్రమే ఈ ఇంజక్షన్లను ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలి. కానీ ఈ వార్డు బాయ్ లు ఇష్టం వచ్చినట్టు వీటిని ఇవ్వడమే గాక, కొందరికి డిస్టిల్డ్ వాటర్ ఇంజెక్షన్లు కూడా ఇఛ్చారట. రోగుల నిరక్షరాస్యత, ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కూడా వీరి నిర్వాకానికి తోడయ్యాయి. అయితే సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు వీరిపై నిఘా పెట్టడంతో వీరి బండారం బయట పడింది. ఈ వార్డు బాయ్ లను అరెస్టు చేయబోగా నలుగురు బౌన్సర్లు వచ్చి పోలీసులపైనే దాడికి యత్నించారు. అంటే ఓ పెద్ద రాకెట్ ఈ వ్యవహారాన్ని నడుపుతోందని పోలీసులు గుర్తించారు. మొత్తానికి ఆరుగురిని వారు అరెస్టు చేశారు.
రెమి డెసివిర్ కి సంబంధించిన 81 వయల్స్ ని ఖాకీలు వీటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ లోని సభ్యులు ఈ మందును 25 వేలరూపాయల నుంచి 40 వేలరూపాయల వరకు అమ్ముతున్నట్టు వెల్లడైంది. అసలైన సూత్రధారులు ఇంకా పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని వారు చెప్పారు. అసలు రెమ్ డెసివిర్ మెడిసిన్ ని రోగులకు నియమిత కాలంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికీ పడితే వారికి ఇవ్వరాదని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ మందు నాణ్యతపై ఇంకా సందేహాలు కొనసాగుతున్నాయి.