కోరుకుండ.. మూగబోయింది

కోరుకుండ సైనిక్‌ స్కూల్‌ మూగబోయింది. తమతో విద్యనభ్యసించిన కల్నల్‌ సంతోష్‌ బాబు.. వీర మరణం పొందడంపై అక్కడి వారు తీరని దుఃఖంలో మునిగిపోయారు...

కోరుకుండ.. మూగబోయింది

Updated on: Jun 17, 2020 | 7:09 PM

కోరుకుండ సైనిక్‌ స్కూల్‌ మూగబోయింది. తమతో విద్యనభ్యసించిన కల్నల్‌ సంతోష్‌ బాబు.. వీర మరణం పొందడంపై అక్కడి వారు తీరని దుఃఖంలో మునిగిపోయారు. 1993 నుంచి 2000 వరకు సైనిక స్కూల్లోనే సంతోష్‌బాబు గడిపాడు. 10వ తరగతిని అక్కడే పూర్తిచేసుకున్నాడు. ఎంతో క్రమశిక్షణతో ఉండే సంతోష్‌బాబు చదువులోనే కాదు.. వివిధ గేమ్స్‌లోనూ రాణించినట్టు అతని సీనియర్‌ శశికిరణ్‌ తెలిపారు.

కల్నల్‌ సంతోష్‌బాబు చదువుకున్న రోజుల్లో ఆయన కూర్చున్న బెంచీ, పడుకున్న బెడ్‌ను చూసి ఇక్కడే అతని బాల్యం గడిచిందని చెప్పారు. ఇటీవల 2018లో తన స్కూల్‌మేట్స్‌ను కలుసుకున్న సమయంలో ఏర్పాటుచేసిన రీ యూనియన్‌ సమయంలోనూ తను చదువుకున్న గది, పడుకున్న రూమ్‌కు వెళ్లి చూసుకున్నట్టు శశికిరణ్‌ చెప్పారు.

కోరుకొండ స్కూల్లో చదువుకునే ముందు సంతోష్‌బాబు తమ ప్రాథమిక అభ్యాసాన్ని మంచిర్యాలలోని లక్షెట్టిపేట శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో పూర్తిచేశాడు. అతనికి చదువు నేర్పిన తొలి గురువు రాహుల్‌ రామన్న… సంతోష్‌బాబు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 4వ తరగతి వరకు తమ వద్ద చదువుకున్నట్టు చెప్పారు. అతనికి విద్యాబుద్దులు నేర్పే అవకాశం తమకు రావడం గురువుగా ఆనందంగా ఉందని ఆనాటి జ్ఞాపకాలను రాహుల్‌ రామన్న గుర్తుచేసుకున్నారు. కల్నల్‌ సంతోష్‌బాబు వీరమరణంపై ప్రగాఢ సానుభూతిని తెలిపారు శ్రీ సరస్వతి విద్యాలయం పూర్వ విద్యార్ధి పరిషత్‌.