Cheating During MBBS Exam: డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీ కొట్టేందుకు కాలి చెప్పులో సెటప్! వీడియో వైరల్
పరీక్షల్లో కాపీ కొట్టేందుకు విద్యార్ధుల ఎత్తులు బ్రహ్మకు సైతం దిమ్మతిరిగేలా ఉంటాయి. రకరకాల టెక్నిక్స్‌తో ఎలాగైనా కాపీ కొట్టేందుకు యత్నిస్తుంటారు. ఎంబీబీఎస్ పరీక్షల్లో ఓ విద్యార్ధి అలాంటి ఎత్తుగతే వేశాడు. ఏకంగా తన మొబైల్ ఫోన్ చెప్పులో దాచి పెట్టి పరీక్ష కేంద్రంలోకి అడుగుపెట్టేందుకు యత్నించాడు. అయితే అనుకోని విధంగా పరీక్ష కేంద్రం వద్ద తనిఖీ చేస్తున్న సిబ్బందికి చిక్కి నాలుక కరచుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఉన్న ఎయిమ్స్ పరీక్షా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అసలేం జరిగిందంటే..

హరిద్వార్, మార్చి 21: ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఉన్న ఎయిమ్స్‌లో ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు. ఇంతలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో సిబ్బంది సాధారణ భద్రతా తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో విద్యార్ధులంతా లైన్‌లో నిలబడి ఉండటం వీడియోలో చూడొచ్చు. ఓ సెక్యురిటీ గార్డు మెటల్ డిటెక్టర్‌తో చెకప్ చేసే క్రమంలో ఒక విద్యార్ధి చెప్పులను విప్పమన్నాడు. అతడి చెప్పులను చేతిలో పట్టుకుని చూడగా మొదట అనుమానం రాలేదు. అయితే రెండోసారి మాత్రం అతని రెండో చెప్పు కూడా విప్పమన్నాడు. ఆ చెప్పును తెరచి చూడగా అరికాలి భాగంలో లోపల రెండు చాంబర్‌లు ఉండటం గార్డు గమనించాడు. ఒక చెప్పుకు మాత్రమే ఇలాంటి ఫెసిలిటీ ఉంది. మరో చెప్పు సాధారణంగానే ఉంది. దీంతో అతడు ఆ చెప్పు చేతిలో పట్టుకుని కింద ఉన్న క్రోక్స్ పట్టి లాగగా దాని కింద స్మార్ట్ ఫోన్ ఉండటం గమనించాడు. చెప్పులో ఫోన్ దాచి, పట్టుబడకుండా ఉండేందుకు ఈ సెటప్ చేసినట్లు కనిపించింది.
ఆ తర్వాత గార్డు కెమెరా వైపు చెప్పును పైకి ఎత్తి చూపి.. చెప్పులో దాచిన ఫోన్ స్పష్టంగా చూపించాడు. చుట్టూ ఉన్న విద్యార్ధులు ఈ దృశ్యాన్ని చూస్తు షాక్‌కు గురవ్వడం వీడియోలో చూడొచ్చు. పట్టుబడిన తర్వాత సదరు విద్యార్థి కాస్త తత్తరపడినట్లు వీడియోలో చూడొచ్చు. అనంతరం నిశ్శబ్దంగా క్యూ నుంచి బయటకు వెళ్ళగా.. విద్యార్ధులకు దూరంగా ఒక పక్కన నిలబడమని అధికారులు ఆదేశించడం వీడియోలో చూడొచ్చు. దీంతో ఆ సంస్థ క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. మంగళవారం (మార్చి 17) పరీక్ష జరుగుతున్న సమయంలో చేపట్టిన తనిఖీల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు ఈ ఏడాది మే నెలలో జరగనున్నాయి. ప్రస్తుతం ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్ధి ఫోన్ దాచిన వ్యవహారంపై విచారణ చేపట్టామని, ఆ తదుపరి తగిన చర్యలు తీసుకుంటామని ఎయిమ్స్ రిషికేష్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ శ్రీలోయ్ మొహంతి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🚨 A student was caught cheating during an AIIMS exam in Rishikesh after hiding a mobile phone inside his slippers; the device was recovered during checking at the center. 🙏 pic.twitter.com/KrmYMEhk6o
— Indian Tech & Infra (@IndianTechGuide) March 18, 2026
వైరల్ అయిన ఈ వీడియో చూసిన నెటిజన్లు మోసం చేయడానికి కొంతమంది అభ్యర్థులు ఎంతకైనా తెగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పోటీ పరీక్షల సమగ్రతను దెబ్బతీస్తాయని, నిజాయితీ గల అభ్యర్థులకు నష్టం కలిగిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. అక్రమ మార్గాల్లో వెళ్లడం కోసం మొత్తం కెరీర్‌ను పణంగా పెట్టడం తగదని కొందరు యూజర్లు హితవు పలికారు. మరికొందరు ఇలా కాపీ కొట్టడాన్ని నిరోధించడానికి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటరలె విద్యా అర్హతల విశ్వసనీయతను దెబ్బతీస్తాయనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




