AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral story: ఇలాంటి బాస్ ఒక్కరు ఉంటే చాలు..! డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు సెల్యూట్!

చిన్న చిన్న కారణాలకే సంబంధాలు దెబ్బతింటున్న ఈ రోజుల్లో, మానవత్వం ఇంకా సజీవంగా ఉందని ముంబైలో జరిగిన ఓ సంఘటన మరోసారి నిరూపించింది. ప్రముఖ హృదయ శస్త్రవైద్యుడు డాక్టర్ ప్రశాంత్ మిశ్రా సోషల్ మీడియాలో పంచుకున్న ఈ కథ ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది

Viral story: ఇలాంటి బాస్ ఒక్కరు ఉంటే చాలు..! డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు సెల్యూట్!
Driver Bypass Surgery
Balaraju Goud
|

Updated on: Jul 22, 2026 | 4:41 PM

Share

చిన్న చిన్న కారణాలకే సంబంధాలు దెబ్బతింటున్న ఈ రోజుల్లో, మానవత్వం ఇంకా సజీవంగా ఉందని ముంబైలో జరిగిన ఓ సంఘటన మరోసారి నిరూపించింది. ప్రముఖ హృదయ శస్త్రవైద్యుడు డాక్టర్ ప్రశాంత్ మిశ్రా సోషల్ మీడియాలో పంచుకున్న ఈ కథ ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. తన డ్రైవర్ ప్రాణాలను కాపాడేందుకు ఓ యజమాని చేసిన ఆర్థిక సాయం, అంతకంటే ముఖ్యంగా అతనికి ఇచ్చిన గౌరవం అందరినీ ఆలోచింపజేస్తోంది.

డాక్టర్ ప్రశాంత్ మిశ్రా వద్దకు వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేసే ఓ వ్యక్తి గుండె బైపాస్ శస్త్రచికిత్స కోసం వచ్చాడు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో, డబ్బు ఆదా చేసుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని డాక్టర్ సూచించారు. అయితే మరుసటి రోజు రోగి కుమారుడు ఫోన్ చేసి, ప్రైవేట్ ఆసుపత్రిలోనే శస్త్రచికిత్స చేయించనున్నట్లు తెలిపాడు.

కొద్ది సేపటికే ఆసుపత్రి ఖాతాలో రూ.4.25 లక్షలు జమ కావడం చూసి డాక్టర్ ఆశ్చర్యపోయారు. ఆ మొత్తాన్ని రోగి యజమాని నేరుగా ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసినట్లు తెలిసింది. అనంతరం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. కృతజ్ఞతలు చెప్పేందుకు డాక్టర్ యజమానికి ఫోన్ చేయగా, ఆయన చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. “అతను నా డ్రైవర్ కాదు… 15 ఏళ్లుగా నాతో కలిసి పనిచేస్తున్న నా సహోద్యోగి. మా బాధ్యతలు వేర్వేరైనా, మేమిద్దరం ఒకే బృందంలో భాగం” అని యజమాని చెప్పడం డాక్టర్‌ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఉద్యోగం ఆధారంగా మనుషులను తక్కువగా చూడకూడదని, ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులేనని ఈ సంఘటన తనకు గొప్ప పాఠం నేర్పిందని డాక్టర్ ప్రశాంత్ మిశ్రా పేర్కొన్నారు.

ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యజమాని చూపిన మానవత్వాన్ని, ఉద్యోగిపై ఉన్న గౌరవాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇంటి సహాయకులు, డ్రైవర్లు, ఇతర సిబ్బందిని కుటుంబ సభ్యుల్లా గౌరవించాలని, చిన్నపాటి దయ, గౌరవం సమాజాన్ని మరింత అందంగా మారుస్తాయని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటన డబ్బు కంటే మానవత్వం, గౌరవం ఎంత గొప్పవో మరోసారి గుర్తు చేసింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us