ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కి ఉద్వాసన పలకవచ్చునని తెలుస్తోంది. ఈ ఊహాగానాల మధ్య ఆయన హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. రావత్ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈయన పాలన ‘బిలో ఏవరేజ్’ (మరీ పేలవంగా) ఉందని పెదవి విరుస్తున్న వేళ ఈయన తొలగింపు తప్పకపోవచ్చునని అంటున్నారు. పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర పరిశీలకులు ..రమణ్ సింగ్, దుశ్యంత్ గౌతమ్ ఈ నెల 6 న డెహ్రాడూన్ వెళ్లి అక్కడి పొలిటికల్ పరిస్థితిని సమీక్షించడంతోనూ, వచ్ఛే ఏడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతోను రావత్ తొలగింపు అనివార్యమేమోనని తెలుస్తోంది. ఈయన స్థానే కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్, లేదా సత్పాల్ మహారాజ్ లను ఉత్తరాఖండ్ సీఎం గా నియమిస్తారేమో అన్న వార్తలు వస్తున్నాయి. అయితే రావత్ తొలగింపు ఊహాగానాలను ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వంశీధర్ భగత్ తోసిపుచ్చారు. అలాంటి యోచనేదీ పార్టీకి లేదని ఆయన చెప్పారు.
కాగా- ప్రభుత్వ పాలనకు సంబంధించి త్రివేంద్ర సింగ్ రావత్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, తమను విశ్వాసం లోకి తీసుకోవడంలేదని పలువురు రాష్ట్ర మంత్రులు ఆరోపిస్తున్నారు. రావత్ పై అవినీతి ఆరోపణలు లేకపోయినప్పటికీ ఆయన బలహీన ముఖ్యమంత్రి అని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు. గతంలో కూడా బీజేపీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులను తొలగించినప్పటికీ అది పార్టీకి ప్రయోజనం కలిగించలేదు.అటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది లాభించలేదు. ఎన్నికలు జరిగే ముందు ఒక సీఎం ను పార్టీ తొలగించిందంటే.. ప్రభుత్వ పాలన చాలా పూర్ గా ఉందని ఒప్పుకున్నట్టే అవుతుందని, పైగా అది విపక్షాలకు మంచి అవకాశం ఇఛ్చినట్టవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో.. త్రివేంద్ర సింగ్ రావత్ ను కొనసాగిస్తారా లేక తొలగిస్తారా అన్నది తేలాల్సి ఉంది.
మరిన్ని చదవండి ఇక్కడ :
నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోన్న తెలుగు తేజం పి .వి సింధు.