అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సంతకంతో చైనా కంపెనీల్లో వణికిపుట్టించాడు. దీంతో అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నానాటికీ ముదురుతున్నట్లు కన్పిస్తోంది. ఇప్పటికే చైనాకు చెందిన పలు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించగా.. తాజాగా అగ్రరాజ్యం స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి చైనా కంపెనీలను డిలీట్ చేసే చట్టంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.
హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్ పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టంతో.. చైనా కంపెనీలు అమెరికా అమెరికా సెక్యూరిటీస్ చట్టాలను పాటించడంలో విఫలమైతే గనుక వాటిని స్టాక్ మార్కెట్ల నుంచి డీలిస్ట్ చేయొచ్చు.
ఈ బిల్లు ప్రకారం లిస్టెడ్ విదేశీ కంపెనీలు తమపై తమ దేశ నియంత్రణేమీ లేదంటూ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాక, అమెరికాలో పబ్లిక్ కంపెనీల ఖాతాలు సమీక్షించే బోర్డు తమ ఖాతాలను కూడా తనిఖీ చేసేందుకు అంగీకరించాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రధానంగా విదేశీ కంపెనీలన్నింటికీ వర్తిస్తుంది.
అయితే ఆడిటింగ్ విషయంలో చైనా కంపెనీలు అమెరికాతో సహకరించకపోవడంతో యూఎస్ కఠినచర్యలు తీసుకొచ్చింది. తాజా చట్టం.. దిగ్గజ కంపెనీలైన అలీబాబా గ్రూప్, బైడు తదితర వాటిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశముంది. ఈ ఏడాది మేలో ఈ బిల్లుకు సెనేట్ ఆమోదించగా.. తాజాగా ట్రంప్ సంతకం చేశారు.