ఎన్నికల ఫలితాలు ఆలస్యమైతే ప్రమాదమే : జుకర్‌బర్గ్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరింత దగ్గరకు వచ్చేశాయి.. నవంబర్ మూడున జరిగే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నారు..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరింత దగ్గరకు వచ్చేశాయి.. నవంబర్ మూడున జరిగే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.. ఆ ఎన్నికల ఫలితాలు సకాలంలో వస్తే మంచిది.. కొంచెం ఆలస్యమైనా ప్రమాదమేనని అంటున్నారు ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్.. ఫలితాలు ప్రకటించడం ఆలస్యమైతే అమెరికాలో అలజడి రేగుతుందని హెచ్చరిస్తున్నారాయన! ప్రస్తుతం అమెరికా ప్రజలు రెండుగా చీలిపోయారని, ఇలాంటి పరిస్థితులలో ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు రోజులు, వారాల సమయం పడితే మాత్రం దేశ ప్రజలలో ఆందోళన నెలకొనడం ఖాయమన్నారు. ఇది తమకు పరీక్షాకాలమని పేర్కొన్నారు.. అధ్యక్ష ఎన్నికలపై తామంతా విస్తృతంగా పని చేస్తున్నామని వివరించారు. ఎన్నికల సమగ్రతను కాపాడటం చాలా కష్టమని, ఈ విషయంలో ఫేస్‌బుక్ చక్కగా పనిచేస్తున్నదని చెప్పుకొచ్చారు జుకర్‌బర్గ్. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు, ఫేస్‌బుక్‌కు అవినాభావ సంబంధం ఉందనిపిస్తోంది.. 2016 అధ్యక్ష ఎన్నికల తర్వాత ఫేస్‌బుక్‌పై బోలెడన్ని విమర్శలు వచ్చాయి.. కేంబ్రిడ్జ్ అనలిటికా స్కామ్ బయటపడటంతో ఫేస్‌బుక్‌ను చాలా మంది తిట్టిపోశారు.. అప్పట్నుంచే ఫేస్‌బుక్‌లో మార్పులు వచ్చాయి.. ఫేక్ అకౌంట్లనన్నింటినీ తొలగించింది అప్పుడే! పెయిడ్ ఆర్టికల్స్‌ను తీసేశారు.. విద్వేషపూరిత పోస్టులకు ఫేస్‌బుక్‌లో స్థానం లేకుండా చేశారు..ఇన్ని చేస్తున్నా ఫేస్‌బుక్‌పై పడిన మచ్చ మాత్రం తొలగిపోలేదు.. ఇప్పటికీ అధికారపార్టీకి ఫేస్‌బుక్ అనుకూలంగా పని చేస్తున్నదని అంటుంటారు డెమొక్రటిక్ నేతలు..