మనం మళ్లీ గెలవబోతున్నాం.. వైట్ హౌస్‌లో అందరినీ ముద్దాడుతాః ట్రంప్

|

Oct 13, 2020 | 3:12 PM

కరోనావైరస్ నుంచి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన అధికారిక కార్యక్రమాల్లో బీజీ అవుతున్నారు. అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌లో జరిగిన ర్యాలీతో ప్రచార బాటలోకి దూకారు.

మనం మళ్లీ గెలవబోతున్నాం.. వైట్ హౌస్‌లో అందరినీ ముద్దాడుతాః ట్రంప్
Follow us on

కరోనావైరస్ నుంచి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన అధికారిక కార్యక్రమాల్లో బీజీ అవుతున్నారు. అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌లో జరిగిన ర్యాలీతో ప్రచార బాటలోకి దూకారు. గతంలో కంటే మరింత హుషారుగా… ఉత్సాహంగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈసారి కూడా విజయం తమదేనని… మరో నాలుగేళ్లు వైట్ హౌస్‌లో తామే ఉండబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అక్కడి ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు.

ఓర్లాండో శాన్‌ఫోర్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఫోస్ వన్ నుండి ఒక వేదికపైకి నడుస్తూ ట్రంప్ ఉత్సాహంగా కనిపించారు. ఇప్పుడు నేను చాలా శక్తివంతంగా ఉన్నాను. మీ ప్రార్థనలతో త్వరగా కోలుకున్నాను. ఆ జనంలోకి నడుస్తాను. అక్కడ ప్రతీ ఒక్కరినీ కిస్ చేస్తాను… అబ్బాయిలను,అందమైన అమ్మాయిలను,అందరినీ ముద్దాడుతాను. ఇప్పటినుంచి సరిగ్గా 22 రోజుల్లో మనం ఎన్నికల్లో గెలవబోతున్నాం. మరో నాలుగేళ్లు వైట్ హౌస్‌లో మనమే ఉండబోతున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ఫ్లోరిడా ఎన్నికల క్యాంపెయిన్‌కు కొద్ది గంటల ముందే ఆయనకు కోవిడ్ 19 నెగటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ట్రంప్ మరింత ఉత్సాహంతో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా ట్రంప్ తన ప్రత్యర్థి జో బిడెన్ పై విరుచుకుపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాపై అంక్షలు తప్పవన్న ట్రంప్… కరోనా నియంత్రణకు వేగంగా స్పందించామన్నారు. లక్షలాది మంది ప్రాణాలను రక్షించామని, దేశంలోని ప్రతి ఒక్కరికి కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తుందనే విషయాన్ని ట్రంప్ మళ్లీ పునరుద్ఘాటించారు. “నా పరిపాలనలో, మేము సురక్షితమైన వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నాము, ఎవ్వరూ చేయలేని విధంగా వేగంగా కరోనా నుంచి కోలుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా, ఇతరత్రా రంగాల్లో ఇతర దేశాలకంటే అమెరికా వేగంగా కోలుకుంటుందని ఆయన అన్నారు.

మరోవైపు, ట్రంప్ ఎన్నికల క్యాంపెయిన్‌పై జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ బాధ్యతారాహిత్యానికి,పట్టి లేని తనానికి ఇది నిదర్శనమన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేకపోవడంతోనే దాదాపు 15వేల మంది ఫ్లోరిడా ప్రజలను వైరస్ బలితీసుకుందని ఆరోపించారు. కరోనాతో ఆస్పత్రిలో చేరిన ట్రంప్ ఆ తర్వాత 4 రోజులకే డిశ్చార్జి అయి హడావుడిగా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. వైరస్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే ట్రంప్ జనంలోకి రావడం ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఈ వారంలో పెన్సిల్వేనియా, అయోవా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్లలో జరిగే కార్యక్రమాల్లోనూ ట్రంప్ ప్రసంగించనున్నారు.