ప్రాణం తీసిన అతివేగం.. అదుపుతప్పిన మోటార్ బైక్.. ఇద్దరు యువకులు దుర్మరణం
నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. మోటార్ బైక్ అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. మోటార్ బైక్ అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని నిడమనూరు మండలం బొక్కమంతల పహాడ్ శివారులో మిర్యాలగూడ – సాగర్ రహదారిపై బుధవారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం బోనుతల గ్రామానికి చెందిన ఒట్టే నరేశ్ (24), హాలియా పట్టణంలోని రెడ్డికాలనీకి చెందిన జావిద్ (25) వ్యక్తిగత పనులపై సాయంత్రం బైక్‌పై మిర్యాలగూడ వైపు నుంచి హాలియా వైపు వెళ్తుండగా ఈ దర్ఘటన జరిగింది. బొక్కమంతల పహాడ్ శివారు మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు చేనులోకి దూసుకెళ్లింది. అతివేగం కారణంగా బైక్ నేలను బలంగా ఢీకొనడంతో శరీరంలో తీవ్ర గాయాలై ఇద్దరు యువకులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.