line women job: పట్టుపట్టారు…కొలువు కొట్టారు… దేశంలోనే మొదటి లైన్ ఉమెన్ కాబోతున్నారు…

| Edited By:

Dec 24, 2020 | 2:14 PM

అందరిలా వారు ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. సర్కారు కొలువు సాధించాలని కోరుకున్నారు. అయితే ఆ కలలకు అధికారులే అడ్డుపడ్డారు.

line women job: పట్టుపట్టారు...కొలువు కొట్టారు... దేశంలోనే మొదటి లైన్ ఉమెన్ కాబోతున్నారు...
Follow us on

అందరిలా వారు ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. సర్కారు కొలువు సాధించాలని కోరుకున్నారు. అయితే ఆ కలలకు అధికారులే అడ్డుపడ్డారు. జాతి, లింగ, వర్ణ వివక్ష చూపకూడని చోట లింగ వివక్ష చూపారు. కనీసం ఉద్యోగ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో వారు కోర్టు మెట్లెక్కారు. పరీక్ష రాశారు. పాసయ్యారు. అయితే అధికారులు మళ్లీ అడ్డుపడ్డారు… మీరు ఈ ఉద్యోగం చేయడానికి పనికి రారని, మరో పరీక్ష నిర్వహించమని అన్నారు. దీంతో చేసేదేం లేక మళ్లీ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు చెప్పడంతో అధికారులు రెండో విడత పరీక్షలు నిర్వహించారు. అందులోనూ పాసయ్యారు.

విద్యుత్ సంస్థలు విడుదల చేసే ఉద్యోగ నియామక ప్రక్రియలోనే లింగ వివక్ష ఉంటోందని 20 ఏళ్ల బబ్బూరి శిరీష, 32 ఏళ్ల వి. భారతి అంటున్నారు. అలా వారు ఎందుకంటున్నారో తెలుసుకుందాం… అంతకంటే ముందు వారు ఒక చరిత్రను లిఖించారు. అందేంటంటే… ఈ ఇద్దరు భారత దేశ చరిత్రలో మొట్టమొదటి లైన్ ఉమెన్ గా విధులు నిర్వహించబోతున్నారు.

 

నోటిఫికేషన్లోనే లింగ వివక్ష….

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్లో లైన్‌మెన్ ఉద్యోగాలూ ఉన్నాయి. వాటికి ఐటీఐ(ఎలక్ట్రికల్) చదివిన శిరీష, భారతి కూడా అప్లై చేశారు. అయితే సదరు విద్యుత్ సంస్థలు ఇవి పురుషులకు మాత్రమేనని వివక్ష చూపాయి. దీంతో ఈ ఇద్దరు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారి ఉద్యోగ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. దీంతో వారికి రాతపూర్వక పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్ష ఫలితాలను సైతం అధికారులు ఆపారు.

 

కోర్టు మెట్లు ఎక్కుతూ…

పరీక్ష కోసం కోర్టు మెట్లెక్కిన ఇద్దరు తిరిగి పరీక్ష ఫలితాల కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో కోర్టు సదరు విద్యుత్ సంస్థలను వారి పరీక్ష ఫలితాలను విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. చేసేదేం లేక విద్యుత్ సంస్థలు ఫలితాలను విడుదల చేశాయి. వాటిలో శిరీష, భారతి ఉత్తీర్ణత సాధించారు. అయితే మళ్లీ విద్యుత్ సంస్థ అధికారులు వారికి రెండో దశ పరీక్షలు… పోల్ టెస్ట్ నిర్వహించలేదని అన్నారు. దీంతో ఆ ఇద్దరు తిరిగి ధర్మాసనం తలుపుతట్టారు. ఈసారి కోర్టు వారికి మొట్టికాయలు వేసి పోల్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించింది. శిరీష, భారతి పోల్ టెస్టులో పాసయ్యారు. ఇప్పుడు వారికి విద్యుత్ శాఖలో లైన్ ఉమెన్ జాబ్ రానుంది. అయితే ఈ ఉత్తర్వుల కోసం వారు హైకోర్టు సింగిల్ బెంచ్ ముందు హాజరు కావాల్సి ఉంటుందని వారి తరపున వాదించిన న్యాయవాది సత్యం రెడ్డి తెలిపారు.

 

నేపథ్యాలు ఇవే….

లైన్ ఉమెన్‌గా రికార్డు స‌ృష్టించబోతున్న 20 ఏళ్ల శిరీష స్వస్థలం సిద్ధిపేట జిల్లా చేబర్థి అనే చిన్న గ్రామం. ఐటీఐ చదివింది. ప్రభుత్వం విడుదల చేసిన లైన్ మెన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. పరీక్షలో పాసైంది. మామ సాయంతో పోల్ ఎక్కడం సైతం నేర్చుకుంది. పోరాడింది. నిలిచింది.. గెలిచింది… ఇక ఇద్దరు పిల్లల తల్లైన వి. భారతి సైతం పోల్ ఉమెన్ కొలువు కొట్టారు. ఆమె స్వస్థలం వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామం. అయితే భర్త మోహన్ సాయంతో పోల్ ఎక్కడం నేర్చుకుంది. విద్యుత్ శాఖ పెట్టిన చివరి పరీక్షలో నిమిషంలోపే ఎనమిది మీటర్లు ఉన్న పోల్‌ను ఎక్కి ఉద్యోగ విజయ శిఖరాన్ని అధిరోహించింది.