చేగుంటలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఇద్దరు మృతి
మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది.
మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది. చేగుంట మండల కేంద్రంలో నిజామాబాద్-హైదరాబాద్ రహదారిపై శనివారం సాయంత్రం వేగంగా వచ్చిన కారు టీవీఎస్ మోపెడ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈఘటనలో మోపెడ్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. చేగుంట మండల కేంద్రానికి చెందిన గౌరయ్య (35), నర్సింలు (50)లు గ్రామశివారులో జాతీయరహదారి సమీపంలో ఉన్న చెరువులో చేపలు పట్టేందుకు మోపెడ్‌పై వెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా గ్రామ సమీపంలో కామారెడ్డి వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేగుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.