హైదరాబాద్‌ పబ్‌ల్లో పోలీసులు దాడులు.. బయటపడ్డ నిజాలు..

హైదరాబాద్‌లో పబ్‌ల పై దాడులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. కొవిడ్‌ నిబంధనలు గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పబ్‌లపై పోలీసులు దాడులు చేశారు.

హైదరాబాద్‌ పబ్‌ల్లో పోలీసులు దాడులు.. బయటపడ్డ నిజాలు..
Follow us
Balaraju Goud

| Edited By: Ravi Kiran

Updated on: Nov 07, 2020 | 9:08 PM

హైదరాబాద్‌లో పబ్‌ల పై దాడులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. కొవిడ్‌ నిబంధనలు గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పబ్‌లపై పోలీసులు దాడులు చేశారు. జూబ్లీహిల్స్‌ లోని నాలుగు పబ్‌ల పై రైడ్‌ చేసిన అధికారులు.. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. రూల్స్‌ బేఖాతర్‌ చేస్తున్న ఆ నాలుగు పబ్‌ల నిర్వాహకుల పై కేసులు నమోదు చేశారు.

కొవిడ్‌ నిబంధనలు సడలించిన ప్రభుత్వం..పబ్‌లు ఓపెన్‌ చేయడానికి అనుమతి ఇచ్చింది. అదే సమయంలో కచ్చితంగా కొన్ని నిబంధనలను పాటించాలంటూ పబ్‌ నిర్వాహకులను ఆదేశించింది. పబ్‌ లోపలికి రావాలంటే మాస్క్‌ కంపల్సరీ చేశారు. పబ్‌లలో “నో మాస్క్‌ నో ఎంట్రీ” రూల్‌ కచ్చితంగా పాటించాలి. అలాగే పబ్‌ లోపల సోషల్‌ డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేయాలి. పబ్‌లలో వెయిటర్స్‌, ఇతర సిబ్బంది తప్పక మాస్క్‌లు ధరించాలి. దీంతోపాటుగా డ్యాన్స్‌ ఫ్లోర్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనలను పాటిస్తూ పబ్‌లకు తెరుచుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

జూబ్లీహిల్స్‌లో చాలా పబ్‌లలో కోవిడ్‌ రూల్స్‌ పట్టించుకోవడం లేదు. దాదాపు నాలుగు నెలల తరువాత అనుమతి ఇవ్వడంతో..నిర్వాహకులు ఆగమేఘాల మీద పబ్‌లను ఓపెన్‌ చేశారు. ముందు కొన్ని రోజులు కోవిడ్‌ నిబంధనలను సీరియస్‌గానే ఫాలో అయ్యారు. కానీ రోజు రోజుకు కస్టమర్ల తాకిడి పెరగడంతో.. పబ్‌లలో కోవిడ్‌ నిబంధనలను గాలికొదిలేశారు. నో మాస్క్‌ నో ఎంట్రీ నిబంధనను కూడా నామమాత్రంగా అమలు చేస్తున్నారు. అంతే కాదు, పబ్‌లలో అసలు సోషల్‌ డిస్టెన్స్‌ అనేది కనపించడం లేదు. వీకెండ్స్‌లో అనేక పబ్ లలో స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.

ధర్మల్ స్క్రీనింగ్, మాస్క్ ధరించే విషయంలో అనేక పబ్‌లు లైట్‌ తీసుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని అమ్నేషియా, తబలారసా, కెమిస్ట్రీ, ఎయిర్‌ లైవ్‌ పబ్‌ల పై వెస్ట్ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందే షాక్‌కు గురయ్యారు..ఎక్కడా కోవిడ్‌ నిబంధనలను పాటించకపోవడమే కాక, డ్యాన్స్‌ ఫ్లోర్‌లో విచ్చలవిడిగా మద్యం మత్తులో చిందులేస్తున్న వారిని చూసి అవాక్కయ్యారు. Halloween night పేరుతో ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తూ సోషల్ డిస్టెన్స్ నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నారు. వందమంది ప్రవేశమే కష్టమైన పబ్‌లలో 250నుండి 300మందికి వరకు ప్రవేశం కల్పిస్తున్నారు. దీంతో తబలారసా, కెమిస్ట్రీ, అమ్నేషియా, ఎయిర్‌ లైవ్‌ పబ్‌ల పై కేసులు నమోదు చేశారు. పబ్ నిర్వాహకుల పై ఎపిడెమిక్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయకపోతే.. పబ్‌లను సీజ్‌ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.