తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న మాజీ మంత్రి డి.కె.అరుణ తన లక్ష్యానికి మరింత చేరువయ్యారా? తాజాగా మద్యనిషేధాన్ని డిమాండ్ చేస్తూ రెండ్రోజుల దీక్షకు దిగడం.. దానికి యావత్ తెలంగాణ యూనిట్ అండగా నిల్వడం చూస్తుంటే నిజమేనంటున్నాయి పార్టీ వర్గాలు. జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపులకు తప్ప రాష్ట్ర స్థాయిలో ఎవరు ఏ కార్యక్రమం చేసినా రాని స్పందన డి.కె.అరుణ దీక్షకు రావడంతో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
డి.కె.అరుణ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పేరున్న నేత. పాలమూరు పాలిటిక్స్‌కు మూలస్థంభంగా భావించే డి.కె. ఇంటి కోడలిగా రాజకీయాల్లోకి వచ్చిన అరుణ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత మారిన పరిణామాలు.. మరీ ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సత్సంబంధాలు లేకపోవడంతో అరుణ కమలం పార్టీలో చేరిపోయారు.
గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన అరుణ గట్టి పోటీనే ఇచ్చారు. కానీ త్రిముఖ పోరులో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి తెలంగాణ బిజెపి అధ్యక్ష స్థానం కోసం ఢిల్లీ పెద్దల్ని మెప్పించేందుకు అరుణ ప్రయత్నిస్తున్నారు. ఒక దశలో ఆమె పేరు ఖరారైందన్న ప్రచారమూ జరిగింది. ఈనేపథ్యంలో అరుణ.. మద్యనిషేధం డిమాండ్ రెండ్రోజుల దీక్షకు పూనుకున్నారు. అయితే ఈ దీక్షకు పార్టీలోని సీనియర్ల నుంచి ఎలాంటి మద్దతు వస్తుందో అన్న సందేహాలు వినిపించాయి.
సందేహాలను పటాపంచలు చేస్తూ.. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ సహా పలువురు పార్టీ సీనియర్లు దీక్షలో అరుణకు సంఘీభావం ప్రకటించారు. మహిళా నేతలు పెద్ద ఎత్తున దీక్షలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో పార్టీలో మెజారిటీ వర్గాన్ని ఒక్కతాటి మీదికి తెచ్చారన్న ఘనత అరుణకు దక్కిందని పరిశీలకులంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బిజెపి అధ్యక్ష స్థానానికి అరుణ మరింత దగ్గరయ్యరని చెప్పుకుంటున్నారు. కానీ, పార్టీలో చిరకాలం నుంచి పనిచేస్తున్న వారిని కాదని ఈ మధ్యకాలంలో చేరిన అరుణకు అధ్యక్ష పీఠం కట్టబెడతారా అన్న సందేహాన్ని ఇంకా కొందరు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి టి.బిజెపికి కొత్త అధ్యక్షుని ఎంపిక పూర్తి చేయాలని బిజెపి అధినాయకత్వం భావిస్తున్న తరుణంలో అరుణకు అవకాశం ఏ మేరకు వుందనే విషయం తేలాల్సి వుంది.