AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: ఇకపై తిరుమలలోనే నెయ్యి తయారీ!.. టీటీడీ కీలక నిర్ణయం

శ్రీవారి నిత్య కైంకర్యాలకు సరఫరా చేసే నెయ్యి విషయంలో టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలోనే సొంతంగా నెయ్యి ఉత్పత్తి చేయాలని, ఇందుకోసం పాల సేకరణపై దృష్టి సారించాలని తీర్మానించింది.ఇందుకు అసరమైన పాలకోసం కొత్త గోవులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

Tirumala: ఇకపై తిరుమలలోనే నెయ్యి తయారీ!.. టీటీడీ కీలక నిర్ణయం
Ttd Latest Decisions
Raju M P R
| Edited By: |

Updated on: Nov 18, 2026 | 9:13 PM

Share

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పెసిఫైడ్ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అధ్యక్షతన స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీనియర్ ఐఏఎస్ అధికారులు వినయ్ చంద్, కన్నబాబు సభ్యులుగా హాజరయ్యారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, శ్రీవారి నిత్య కైంకర్యాలకు అవసరమైన నెయ్యి ఉత్పత్తి, తిరుపతిలో భక్తుల కోసం కొత్త సౌకర్యాల కల్పన వంటి అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఇకపై టీటీడీ సొంతంగా నెయ్యి ఉత్పత్తి!

శ్రీవారి నిత్య కైంకర్యాలు, పూజలకు వినియోగించే నెయ్యిని ఇకపై టీటీడీ సొంతంగా ఉత్పత్తి చేయాలని స్పెసిఫైడ్ అథారిటీ నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన పాల సేకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం శ్రీవారి నిత్య కైంకర్యాలకు రోజుకు సుమారు 80 కిలోల నెయ్యి అవసరమవుతుందని గుర్తించింది. నెయ్యి ఉత్పత్తికి సరిపడా పాలను సేకరించేందుకు మరిన్ని దేశీయ గోవులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

వైకుంఠ ద్వార దర్శనాలపై కీలక నిర్ణయాలు

అలాగే ఈ సమావేశంలో వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. డిసెంబర్ 20 నుంచి 29 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నట్లు స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

గతేడాది 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని, ఈసారి 8.34 లక్షల మందికి దర్శనం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గతేడాది మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా ఆన్‌లైన్‌లో టోకెన్లు కేటాయించగా.. ఈసారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులకు మాత్రమే ఈ విధానంలో టోకెన్లు కేటాయించనున్నారు. ఈ రెండు రోజులకు కలిపి 1.6 లక్షల మందికి స్లాటెడ్ దర్శన టోకెన్లు అందించనున్నారు.

మొత్తం పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 92 శాతం సమయాన్ని సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇచ్చేలా కేటాయించనున్నట్లు ముద్దాడ రవిచంద్ర తెలిపారు. మూడో రోజు నుంచి రోజుకు 15 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార ప్రదక్షిణం, శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇదిలా తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమైజ్డ్ టౌన్‌షిప్ నిర్మాణానికి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును రూ.2,700 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు చైర్మన్ ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు. తిరుమలలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు శానిటేషన్ సిబ్బందిని పెంచాలని అథారిటీ నిర్ణయించింది. శిల్పకళాశాల విద్యార్థుల కోసం రూ.29 కోట్లతో నూతన హాస్టల్ నిర్మించనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా తిరుమలలో నీటి నిల్వల పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, అవసరాలకు సరిపడా నీటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

మరోవైపు అలిపిరి మెట్ల మార్గంలోని నరసింహస్వామి ఆలయం నుంచి మోకాళ్ల మెట్టు వరకు బ్రిడ్జి నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ విభాగానికి స్పెషల్ ఆఫీసర్‌గా విశ్రాంత చీఫ్ ఇంజినీర్‌ను నియమించనున్నట్లు టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us