
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలు క్రమేపీ పరిష్కారమవుతున్నాయి. ఉభయ రాష్ట్రాల సీఎం లు కేసీఆర్. జగన్ ఇద్దరూ ఇటీవల జరిపిన సమావేశంలో.. కృష్ణా, గోదావరి జలాలను సమానంగా పంచుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఈ రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. హైదరాబాద్ లో మంగళవారం సమావేశమైన ఈ రాష్ట్రాల ఇరిగేషన్ ఇంజనీర్లతో కూడిన హై లెవెల్ కమిటీ..మొదట కృష్ణా రివర్ బేసిన్ కి గోదావరి జలాల డైవర్షన్ పై చర్చించింది. అనంతరం ఇలా మళ్లించిన జలాలను ఉభయ రాష్ట్రాలూ సమానంగా పంచుకోవాలని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇంజనీర్లు మురళీధర రావు, వెంకటేశ్వరరావు, అంతర్ రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ నరసింహారావు, తెలంగాణ ఇరిగేషన్ విభాగం ఆఫీసర్ ఆన్ డ్యూటీ శ్రీధర్ దేశ్ పాండే, రిటైర్డ్ ఇంజనీర్లతో కూడిన ఈ కమిటీని ఈ మధ్యే రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ఏర్పాటు చేశాయి.
గోదావరి నుంచి వెయ్యి టీఎంసి ల నీరు లభ్యమవుతుందని, తెలంగాణకు ఇరిగేషన్, పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 700 నుంచి 800 టీఎంసీల జలాలు కావాల్సి ఉంటుందని తెలంగాణ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర రావు తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 1300 టీఎంసీ ల నీరు అవసరమవుతుందని అంచనా అన్నారు. కాగా-నీటి డైవర్షన్ పైన, దీన్ని మళ్లించే మార్గంపైనా చర్చించేందుకు తిరిగి సమావేశం కావాలని ఈ కమిటీ నిర్ణయించింది. గోదావరితో ప్రాణహిత, ఇంద్రావతి నదుల అనుసంధానంపై చర్చించామని, ఏపీ ఇంజనీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ రెండు నదులూ దుమ్మగూడెం వద్ద గోదావరిలో కలిసినప్పుడు వెయ్యి టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు.