
TRS Parliamentary and Legislative Party Meeting : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై టీఆర్ఎస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇదే ప్రధాన అంశంగా బుధవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించనుంది.
టీఆర్ఎస్‌కు చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయా జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకొని సమావేశానికి తీసుకురావాలాని మంత్రులకు సూచించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్ల బాధ్యత అప్పగించారు.
ఇప్పటికే నేతలకు వారికి అప్పగించిన డివిజన్ల వివరాలను అందించారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అసమ్మతులు, అసంతృప్తులతో ఎలా వ్యవహరించాలి.. విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి.. ఏయే అంశాలను ప్రచారంలోకి తీసుకెళ్లాలి అనే తదితర అంశాలపై పార్టీ నేతలకు కేసీఆర్ ఈ సమావేశంలో స్పష్టతనివ్వనున్నారు.