
ఆల్‌పార్టీ మీటింగ్ ఒక రొటీన్‌గా మారిందని అభిప్రాయపడ్డారు టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ కే కేశవరావు. ఇక్కడ మాట్లాడుకున్న అంశాలు అమలు కావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిసారి అల్ పార్టీలో మాట్లాడుకోవడం, తర్వాత అమలుకాకపోవడం పరిపాటిగా మారిందన్నారు. “పార్లమెంట్ ఉన్నది ప్రజా సమస్యలపై చర్చించడం కోసం. అప్పుడే ఉత్తమ పరిష్కార మార్గాలు దొరుకుతాయి.” అని కేకే చెప్పుకొచ్చారు. “రైతు చట్టాలను మేము వ్యతిరేకించాము. ఎందుకు వ్యతిరేకిస్తున్నామో కూడా చెప్పాము. కనీసం సెలెక్ట్ కమిటీకి పంపమన్నాం. కానీ కేంద్రం పంపలేదు. ప్రస్తుతం రైతులతో ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో చర్చలు జరపడం మంచి పరిణామం.” అని కేకే వ్యాఖ్యానించారు. అయితే జనవరి 26 హింస సరికాదని. ఎవరైనా ఖండించాల్సిన అంశమదని కేకే చెప్పుకొచ్చారు. తెలంగాణలో మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి ఇస్తున్నామని చెప్పిన కేకే, అనేక రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. విభజన చట్టంలో ఇంకా అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిపై చర్చ జరగాలని కేకే సూచించారు. “ఓబీసీ రిజర్వేషన్ విషయంలో చర్చ జరగాలి. కొత్తగా ఇచ్చే రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. కాకపోతే ఇందులో లోపాలు సరిదిద్దాలి. ఓబీసీకి ఒక మంత్రిత్వశాఖ కావాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద కూడా చర్చ జరపాలి. ఇది చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉంది.” అని కేకే అన్నారు. ఇలాఉండగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో చర్చిన అంశాల గురించి కేకే పైవిధంగా తన అభిప్రాయాన్ని సమావేశానంతరం వెలిబుచ్చారు.