AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాబోయే ఎన్నికలకు రెడీ అవుతున్న టీఆర్ఎస్

రాష్ట్రంలో త్వరలో జరగనున్న వరుస ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర సమితి ఫోకస్ చేసింది. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, వాటి విజయమే లక్ష్యంగా పక్కా ఫ్లాన్ రచిస్తోంది.

రాబోయే ఎన్నికలకు రెడీ అవుతున్న టీఆర్ఎస్
Balaraju Goud
| Edited By: |

Updated on: Sep 27, 2020 | 2:53 PM

Share

రాష్ట్రంలో త్వరలో జరగనున్న వరుస ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర సమితి ఫోకస్ చేసింది. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, వాటి విజయమే లక్ష్యంగా పక్కా ఫ్లాన్ రచిస్తోంది. ప్రతి ఎన్నికకు పకడ్బందీగా వ్యూహరచనతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పార్టీ అధినాయకత్వం కసరత్తు మొదలు పెట్టింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ఎన్నికల పర్యవేక్షకులతో పాటు సమన్వయకర్తలకు బాధ్యతలను అప్పగిస్తున్నారు.

వచ్చే నెల 9న నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనుంది. మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపుతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్నారు. దీంతో ఈ స్థానానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లయిన ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో 80 శాతం వరకు టీఆర్ఎస్ కు చెందినవారే ఉండటంతో కవిత గెలుపు ధీమాతో ఉంది. అయినా పట్టు సడలనీయకుండా పక్కా ప్రణాళికతో ఓటర్లు చేజారకుండా చూసుకుంటుంది టీఆర్ఎస్. ఎన్నికల తేదీ వెలువడిన వెంటనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్‌, ఇతర ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. వారికి శాసనసభ నియోజకవర్గాలు, మండలాలు, కార్పొరేషన్‌, పురపాలక సంఘాల వారీగా బాధ్యతలు అప్పగించారు.

మరోవైపు, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మరణించగా… అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నవంబరులో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి బలమైన నియోజకవర్గాల్లో ఒకటైన దుబ్బాకను మళ్లీ కైవసం చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. రామలింగారెడ్డి భార్య సుజాతారెడ్డి అభ్యర్థిత్వం వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఆమెకు మద్దతు కూడగట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోని నియోజకవర్గం కావడంతో పార్టీ ఫోకస్ దుబ్బాకపై చేసింది. ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఎన్నికల బాధ్యతలను చేపట్టి, పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయపరిచి ముందుకు సాగుతున్నారు ఇప్పటికే హరీష్ రావు దుబ్బాక నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ కు ఓట్ బ్యాంక్ గా దుబ్బాకలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలనే సీఎం ఆదేశాలకు అనుగుణంగా క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు.

ఇక, వచ్చే మార్చితో వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ కు చెందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి , హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ బీజేపీకి చెందిన రాంచందర్‌రావుల పదవీ కాలం ముగుస్తోంది. అంతకంటే ముందే ఈ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇప్పటి వరకు పట్టభద్ర ఎన్నికల్లో మిశ్రమ ఫలితాల చవిచూసిన టీఆర్ఎస్.. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అధిపత్యాన్ని సంపాదించాలని అధికారపార్టీ చూస్తోంది. రెండింటినీ గెలిచేందుకు వీలుగా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. కేటీఆర్‌ రెండు స్థానాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ సభ్యత్వ నమోదు అక్టోబరు ఒకటో తేదీ నుంచి మొదలు కానుంది. సభ్యత్వ నమోదు కీలకం కావడంతో దానిని పెద్దఎత్తున చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచిస్తూ టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. త్వరలోనే పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థులను అధ్యక్షులు కేసీఆర్‌ ఖరారు చేయనున్నట్లు సమాచారం.

వరంగల్‌- ఖమ్మం- నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి శాసనసభ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జులను పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ శనివారం నియమించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి- వరంగల్‌ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు, ఉమ్మడి జిల్లా ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, విద్యాసంస్థలు, ఉద్యోగ సంఘాల బాధ్యతలను అప్పగించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి స్టేషన్‌ ఘన్‌పూర్‌; ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి- జనగామ, పాలకుర్తి, మండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు -పరకాల, వర్ధన్నపేట; ఎంపీ పసునూరి దయాకర్‌, దివ్యాంగుల సంస్థ ఛైర్మన్‌ వాసుదేవరెడ్డి- భూపాలపల్లి; ఎంపీ కవిత, రైతువిమోచన సంస్థ ఛైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు-నర్సంపేట, ములుగు; మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, డీసీసీబీ ఛైర్మన్‌ మార్నేని రవీందర్‌ రావులు – మహబూబాబాద్‌, డోర్నకల్‌; పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్‌- మహబూబాబాద్‌ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు

మరోవైపు హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ పాలకవర్గం పదవి కాలం వచ్చే ఫిబ్రవరితో ముగుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా డిసెంబరు చివరిలో జరిగే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటికే డివిజన్ల వారీ ఎన్నికల అధికారులను నియమించిన జీహెచ్ఎంసీ ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేసే పనిలో పడింది. గతంలో లాగే ఈసారి కూడి కూడా గ్రేటర్ లో క్లిన్ స్విప్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నేతృత్వంలో బహుముఖ ప్రణాళికతో సన్నద్ధమవుతోంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 150 డివిజన్ల ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించారు. మహానగరంలో పెండింగ్ లో ఉన్న భారీ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. డివిజన్ల వారీగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నారు. కేటీఆర్‌ రోజువారీ సమీక్షలు జరుపుతూ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు..

వచ్చే మార్చిలో వరంగల్‌, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గాల గడువు ముగుస్తుంది. జనవరి లేదా ఫిబ్రవరిలో మళ్లీ ఎన్నికలు జరిగే వీలుంది. ఈ రెండు అధికార పార్టీకి ముఖ్యమైన కార్పొరేషన్లు కావడంతో వాటిల్లో మళ్లీ పాగా వేసేందుకు వీలుగా టఆర్ఎస్ ఇప్పటి నుంచే దృష్టి సారించింది. రెండు చోట్లా పార్టీ నేతలకు డివిజన్ల వారీగా బాధ్యతలను అప్పగించారు. రెండు కార్పొరేషన్ల పరిధిలోని ప్రజల సమస్యలను గుర్తించి.. అభివృద్ధి పనుల వేగవంతం చేశారు. కరోనా వైరస్ విజృంభణతో ఇంతకాలం స్తబ్ధతగా ఉన్న క్యాడర్ లో ఫుల్ జోష్ నింపుతూ ఎన్నికలకు వెళ్లలాని టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది.