Vizianagaram: కలుపు తీస్తోన్న గిరిజనుడిపైకి దూసుకువచ్చి చుట్టేసిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత
పొలంలో పనులు చేస్తున్న జన్ని రాము అనే గిరిజనుడిపై కింగ్ కోబ్రా అకస్మాత్తుగా దాడి చేసింది. సుమారు పది అడుగుల పొడవుతో భయానకంగా ఉన్న కింగ్ కోబ్రా పెద్ద పెద్దగా బుసలుకొడుతూ జన్ని రాముపై దాడి చేయడంతో ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ భయాందోళనకు గురయ్యాడు. పొలం పనిలో నిమగ్నమైన గిరిజనుడికి ఎదురైన ఈ ఘటన స్థానికులను సైతం గగుర్పాటుకు గురి చేసింది.
జన్ని రాము ప్రతిరోజు పొలం పనులకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఎప్పటిలాగే రాము ఉదయాన్నే జీడి మామిడి తోటకెళ్లి తోటలో ఉన్న కలుపు మొక్కలను తొలగిస్తూ పని చేసుకుంటున్నాడు. ఇంతలో సుమారు పది అడుగుల పొడవున్న భయానక కింగ్ కోబ్రా బుసలు కొడుతూ ఒక్కసారిగా రాముపై దూసుకువచ్చి దాడికి దిగింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఏం జరిగిందో తెలియక మొదట అయోమయానికి గురయ్యాడు. వెంటనే తేరుకున్న రాము కింగ్ కోబ్రా బారి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయినా కింగ్ కోబ్రా మాత్రం వదలకుండా రామును వెంబడించింది. ఇక చేసేది లేక వెనుదిరిగిన రాము కింగ్ కోబ్రాను పట్టుకొని విసిరేసేందుకు యత్నించాడు. అయితే కింగ్ కోబ్రా మాత్రం తనను పట్టుకున్న రామును చుట్టుముట్టింది. దీంతో వెంటనే ఒక చేత్తో పాము మెడ భాగం పట్టుకుని మరో చేత్తో పక్కనే ఉన్న కత్తి తీసుకొని కింగ్ కోబ్రాను నరికేశాడు. చివరికి రాము దాడిలో కింగ్ కోబ్రానే మృత్యువాత పడింది. విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం మూలబొడ్డవర పంచాయితీ గాదెలలో జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.
ఇదంతా జరుగుతున్న సమయంలో రాము కేకలు విన్న చుట్టుపక్కల పంట పొలాల్లో ఉన్న రైతులు పరుగు పరుగున వచ్చారు .అలా వచ్చిన రైతులు చూస్తుండగానే కింగ్ కోబ్రాకు, రాముకు మధ్య జరిగిన దాడితో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. చివరకు రాము దాడిలో భయంకరమైన కింగ్ కోబ్రా మృత్యువాత పడక తప్పలేదు. ఇదంతా చూసిన రైతులంతా కింగ్ కోబ్రా మృతితో ఊపిరి పీల్చుకున్నారు. కింగ్ కోబ్రాపై బారి నుంచి బయటపడ్డ రాము తెగువకు అంతా ప్రశంసించారు. అయితే ఆ దాడిలో కింగ్ కోబ్రా కాటుకు గురవ్వకుండా రాము చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణహాని తప్పింది. కింగ్ కోబ్రాలు ఎస్ కోట పరిసర ప్రాంతంలో తరచూ సంచరిస్తుండటం స్థానికులకు భయాందోళనలను గురిచేస్తుంది. అరకు, ఎస్ కోటలో ఉన్న కొండ ప్రాంతాల్లో భయంకరమైన కింగ్ కోబ్రాలు సంచరిస్తుంటాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు స్నేక్ క్యాచర్స్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి