Telangana: పాడుబడ్డ ఇంట్లో నుంచి అదో మాదిరి శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా..
అదిగో లచ్చిందేవి అంటూ నట్టింట్లో తవ్వకాలు చేపట్టింది గుప్తనిధి ముఠా. కానీ జనం అలెర్ట్ కావడంతో కథ అడ్డం తిరిగింది. నిధి జాడ దొరకలేదు కానీ నిందితుల కథ కటకటాలకు చేరింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో సంచలనం రేపింది.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కన్నెపల్లి గ్రామంలో ఓ పాడు బడ్డ ఇంట్లో క్షుద్రపూజల తంతు కలకలం రేపింది. పసుపు , కుంకుమ , నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేస్తుండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ముచ్చట తెలియని దుండగులు గుట్టుగా గుప్తనిధుల తవ్వకాలు నిర్వహించారు. గుప్త నిధి జాడ సంగతేమో కానీ … పక్కా టైమింగ్‌తో ఖాకీలు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇల్లంతా పసుపు కుంకుమ నిమ్మకాయాలతో క్షద్రపూజల సీన్ కంటపడింది. లోనికి వెళ్తే తవ్వకాలు జరుగుతున్నాయి. రెడ్‌హ్యాండెడ్‌గా నులుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుండి 6 సెల్ ఫోన్లు, ఒక ఆటో, తవ్వకానికి ఉపయోగించిన పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరా తీస్తే గుప్తనిధి అన్వేషణ వ్యవహారం బయటపడింది. పోలీసుల రాకడను పసిగట్టిన ఇంటి యజమాని మహేష్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఎస్కేపయ్యారు.
ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సాకెర గ్రామంలో కూడా ఇలానే గుప్త నిధుల కోసం ఓ పొలంలో తవ్వకాలు జరిపారు.స్థానికులు అడ్డుకోవడంతో గుప్తనిధి ముఠా పరారైంది. తక్కువ సమయంలో కోటీశ్వరులవ్వాలనే అత్యాశ తో కొందరు గుప్తనిధుల ముఠాలో ట్రాప్‌లో పడుతున్నారు.. అత్యాశకు పోతే నిండా మునగడం ఖాయం..అలాంటి ముఠాలను నమ్మోద్దన్నారు పోలీసులు. కన్నెపల్లి గ్రామంలో పట్టుబడిన ముఠా.. ఇంకా ఎక్కెడెక్కడ గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు? ఎంత మందిని ట్రాప్ చేశారు? ఇంటి ఓనర్ మహేష్ వాళ్ల ట్రాప్‌లో పడ్డాడా? లేదంటే అతను కూడా గుప్తనిధి బ్యాచ్‌లో మెంబరేనా? ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు చెన్నూరు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..