రాజధాని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. షాక్ అంటే భారీ ఫైన్లను వేయడమో లేక వాహనాన్ని సీజ్ చేయడమో కాదండీ. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్న టైమర్లను ఇకపై దశల వారీగా తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు ట్రాఫిక్ సేఫ్టీలో కీలక పాత్ర వ్యవహరించిన వీటిని సాంకేతిక లోపాల దృష్ట్యా తీసేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.
2014లో ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (హెచ్‌టిఆర్‌ఎంఎస్)లో భాగంగా ఈ టైమర్లను ప్రవేశపెట్టారు. ఇక అప్పటి నుంచి వాహనదారులు వీటి ఆధారంగా పక్కవారికి అసౌకర్యం కలగకుండా బండి ఇంజిన్లను ఆఫ్ చేసుకుంటూ నిబంధనలు పాటించేవారు. అంతేకాకుండా వీటి వల్ల ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గిందనే చెప్పాలి.
వాహనదారులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా సాగించడంలో ఇవి బాగా ఉపయోగపడ్డాయని ట్రాఫిక్ అధికారి ఒకరు వెల్లడించారు. వీటిని సిగ్నల్స్ వద్ద అమర్చిన తర్వాత ముఖ్యమైన ప్రదేశాల్లో ట్రాఫిక్ జామ్‌లు, రద్దీ తగ్గుతూ వచ్చిందన్నారు. అయితే అనుకోని విధంగా ఈ టైమర్లు 2017 డిసెంబర్ నుంచి సాంకేతిక లోపల వల్ల పని చేయడం మానేశాయి. ఇక టెక్నికల్ సిబ్బంది కూడా వాటిని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
ప్రస్తుతం భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ టైమర్ల కాంట్రాక్ట్‌ను తీసుకోగా.. ఆ సంస్థ గడువు ఫిబ్రవరితో ముగుస్తోంది. దానితో కొత్త టెండర్ల ప్రక్రియ ప్రారంభించి నూతన టైమర్లను అమర్చాలని ట్రాఫిక్ యంత్రాంగం నిర్ణయించింది.