AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొక్కేం కాదు.. హార్దిక్ కానేకాదు.. సెంచరీ బాదడానికి కారణం ఎవరో చెప్పేసిన తిలక్ వర్మ

Tilak Varma IPL 2026 Century: వరుసగా 4 మ్యాచ్‌లు ఓడిపోయిన ముంబై ఇండియన్స్ జట్టుకు తిలక్ వర్మ ఊపిరి పోశాడు. తన అజేయ సెంచరీతో జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. ఈక్రమంలో మ్యాచ్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. తన సెంచరీ కారణం హార్దిక్ అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.

తొక్కేం కాదు.. హార్దిక్ కానేకాదు.. సెంచరీ బాదడానికి కారణం ఎవరో చెప్పేసిన తిలక్ వర్మ
Gt S Mi Tilak Varma Century
Venkata Chari
|

Updated on: Apr 21, 2026 | 6:32 PM

Share

Tilak Varma IPL 2026 Century: ముంబై ఇండియన్స్ యువ కెరటం, తెలుగు తేజం తిలక్ వర్మ ఐపీఎల్ 2026లో అద్భుతమైన ఫీట్ సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక పోరులో అజేయ శతకంతో కదం తొక్కి, వరుస ఓటములతో సతమతవుతోన్న తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. సంక్షోభంలో ఉన్న జట్టును ఆదుకుంటూ అతను ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సంక్షోభంలో ముంబై.. ఆపద్భాందవుడిలా తిలక్..

వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోరులో రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమవ్వడం జట్టును మరింత దెబ్బతీసింది. ముంబై 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు.

ప్రారంభంలో ఆవేశానికి లోనుకాకుండా, పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిలకడగా ఆడాడు. రషీద్ ఖాన్, రబడ వంటి దిగ్గజ బౌలర్ల బంతులను గౌరవిస్తూనే, అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలతో విరుచుకుపడ్డాడు.

మెరుపు శతకం.. రికార్డుల వేట

కేవలం 45 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నమన్ ధీర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులు, హార్దిక్ పాండ్యాతో ఐదో వికెట్‌కు 81 పరుగుల కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. తిలక్ మెరుపులతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ముంబై బౌలర్ల ధాటికి తలవంచక తప్పలేదు.

నా నైపుణ్యాన్ని నమ్ముకున్నాను: తిలక్ వర్మ

మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై తిలక్ వర్మ భావోద్వేగంగా స్పందించాడు. “తొలి సెంచరీ సాధించడం ఎప్పుడూ ప్రత్యేకమే, అది కూడా జట్టుకు విజయం అవసరమైన సమయంలో రావడం చాలా సంతోషాన్ని ఇస్తోంది” అని తెలిపాడు.

క్రీజులో కుదురుకోవడానికి మొదటి 20 బంతులు జాగ్రత్తగా ఆడానని, ఒత్తిడిలో ఉన్నప్పుడు సొంత నైపుణ్యాన్ని నమ్ముకోవడమే తనకు మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో డీకాక్, సంజూ శామ్సన్ తర్వాత సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా తిలక్ రికార్డు సృష్టించాడు.

జట్టులో కొత్త ఉత్సాహం..

వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత లభించిన ఈ విజయం ముంబై ఇండియన్స్ శిబిరంలో కొత్త ఆశలు చిగురింపజేసింది. తిలక్ వర్మ చూపిన తెగువ, పరిణతి చెందిన బ్యాటింగ్ తీరు భవిష్యత్తులో అతను భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతాడనడంలో సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us