AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్దపులి భయంతో జంతు బలి బంద్.. మహబూబాబాద్ జిల్లాల్లో వణుకుతున్న జనం.. అమ్మవార్లకు కరవైన జంతుబలులు

మహబూబాబాద్ జిల్లాల్లో రెండు గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. దానికి కారణం ఆ ప్రాంతంలో రెండు పులులు సంచరిస్తుండడమే. తాము భక్తితో దేవుళ్ళకు ఇచ్చే జంతుబలులు.. ఇపుడు పులులకు ఆహారం కావడంతో అవి సమీప ప్రాంతాలకు చేరుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

పెద్దపులి భయంతో జంతు బలి బంద్.. మహబూబాబాద్ జిల్లాల్లో వణుకుతున్న జనం.. అమ్మవార్లకు కరవైన జంతుబలులు
Rajesh Sharma
|

Updated on: Nov 15, 2020 | 2:02 PM

Share

Tiger fear in Mahabubabad district: ఆ అమ్మవారికి భక్తులు సమర్పించే జంతుబలి ఇప్పుడు వారి ప్రాణాలకే ముప్పు తెచ్చింది. భక్తులు సమర్పించే మూగజీవుల రక్తపు రుచి మరిగిన పెద్దపులి స్థానికులను హడలెత్తిపోయేలా చేస్తుంది. ఆలయ పరిసరాల్లో సంచరిస్తున్న పెద్దపులి మూగ జీవులను బలి తీసుకుంటుండడంతో ముసలమ్మ దేవాలయం పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పాద ముద్రల ఆధారంగా రెండు పులులు సంచరిస్తున్నాయని అటవీశాఖ సిబ్బంది భావిస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. పది రోజుల క్రితం గూడూరు మండలంలో మొదటిసారిగా పులి ఆనవాళ్లు కనిపించాయి. ఆ తరువాత కొత్తగూడ మండలం రాంపూర్‌ అటవీప్రాంతంలో లభ్యమయ్యాయి. ఓ ఆవును చంపేసినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు.. దీంతో పులి సంచారం కలకలం రేపింది. కొత్తగూడ మండలంలోని గుంజేడు ముసలమ్మ ఆలయ సమీపంలో పెద్దపులి పాదముద్రలు లభ్యమయ్యాయి. బయ్యారం మండలం గురిమెళ్ల అటవీ ప్రాంతం నుండి ఇక్కడికి పులి వచ్చినట్లు పాదముద్రల ఆనవాళ్ల ద్వారా తెలుస్తోంది.

మరోవైపు గార్ల మండలం ముల్కనూరు గ్రామ పరిసరాల్లో పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. తాజాగా శుక్రవారం నాడు కురవి మండలం బలపాల, రాజోలు, స్టేషన్‌ గుండ్రాతిమడుగు శివారు తండాల పరిధిలో పులి అడుగులను రైతులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.. ఈ క్రమంలో పులి పాదాల అచ్చులను పరిశీలించి పెద్దపులి సంచారం నిజమేనని అటవీశాఖ అధికారులు తేల్చారు. కొత్తగూడ మండలంలోని గుంజేడు ముసలమ్మ ఆలయ పరిసరాల్లో రెండు పులులు సంచరిస్తున్నట్లు పాదముద్రల ఆధారంగా గుర్తించారు. అయితే ముసలమ్మ దేవాలయంలో అమ్మవారికి మొక్కలు చెల్లించుకునే భక్తులు కోళ్లు, మేకలను జంతు బలి ఇస్తుంటారు.

ప్రతీ ఆదివారం ముసలమ్మ ఆలయ ప్రాంగణంలో జాతరను తలపించే రీతిలో భక్తుల దర్శనాలు జరుగుతుంటాయి. కోరికలు నెరవేరిన వెంటనే భక్తులు అమ్మవారికి జంతు బలి ఇస్తుంటారు. రక్తపు వాసన పసిగట్టి పులి ఈ ప్రాంతంలో సంచరిస్తుందని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికే ఓ ఆవును బలి తీసుకోవడంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గత పదిరోజుల నుండి మహబూబాబాద్ జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి ఇప్పుడు గుంజేడు ముసలమ్మ ఆలయ పరిసరాల్లో ప్రత్యక్ష మవడంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. పాద ముద్రల ఆధారంగా రెండు పులులు సంచరించినట్లు గుర్తించడంతో ముసలమ్మ ఆలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు.. దేవాలయ సమీపంలో భక్తులకు హెచ్చరిక బ్యానర్లకు ఏర్పాటు చేశారు. సాధారణంగా దర్శనం అనంతరం భక్తులు అటవీ ప్రాంతంలోకి వెళ్లి వంట చేసుకుని సేదతీరి సాయంత్రం సమయానికి ఇళ్లకు వెళుతుంటారు. ఈ నేపథ్యంలో అడవి లోపలికి వెళ్లవద్దంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు.

ALSO READ: ఆన్‌లైన్ జూదానికి మరొకరు బలి