కోచింగ్​ సెంటర్‌లోకి వరదనీరు.. ముగ్గురు సివిల్స్​ ఆశావహులు మృతి.. తెలంగాణ మహిళ కూడా

|

Jul 28, 2024 | 12:44 PM

భారీ వర్షం కారణంగా సెంట్రల్ దిల్లీలోని ఓ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్​ బేస్​మెంట్​లోకి వచ్చిన వరద నీరు వల్ల ముగ్గురు సివిల్స్​ ఆశావహులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు తెలంగాణ, కేరళ, ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వారిగా గుర్తించారు.

కోచింగ్​ సెంటర్‌లోకి వరదనీరు.. ముగ్గురు సివిల్స్​ ఆశావహులు మృతి.. తెలంగాణ మహిళ కూడా
Upsc Aspirants' Deaths
Follow us on

ఢిల్లీ రాజేంద్రనగర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. రావ్స్ కోచింగ్ సెంటర్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు చనిపోయారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కోచింగ్ సెంటర్‌ దగ్గర విద్యార్థుల ఆందోళనతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. సహచరుల మృతిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

శనివారం సాయంత్రం రాజేంద్రనగర్‌ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో వర్షపు నీటితో రావ్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ సెల్లార్‌ మునిగిపోయింది. సెల్లార్‌లో లైబ్రరీలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. రాత్రి 7 గంటల సమయంలోనే తాము నీటిలో చిక్కుకున్నామంటూ పలువురు అభ్యర్థులు ఫైర్‌ స్టేషన్‌కు కాల్‌ చేశారు. కాని ఫైర్‌ సిబ్బంది రాడానికి ఆలస్యమైంది. ట్రాఫిక్‌ కారణంగా రెండు గంటల ఆలస్యంగా రావడంతో.. అప్పటికే నీటిలో చిక్కుకున్న వారిలో ఒకరు చనిపోయారు. పోలీసులు అక్కడకు వచ్చినా.. కొందరినే రక్షించగలిగారు. ఫైర్‌ సిబ్బందితోపాటు.. NDRF కూడా అక్కడకు చేరుకుని కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌ నుంచి నీటిని తోడే ప్రక్రియ ప్రారంభించారు. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించినా… ముగ్గురు అభ్యర్థుల్ని కాపాడలేకపోయారు.

రావ్స్ కోచింగ్ సెంటర్‌ రోడ్డు కంటే కిందకు ఉండటంతో.. వరద నీరు భారీగా వచ్చి చేరింది. వరద వస్తున్న సమయంలో సెల్లార్‌లోని లైబ్రరీలో దాదాపు 30మంది ఉన్నట్లు సివిల్ సర్వీస్ అభ్యర్థులు చెబుతున్నారు. చాలామంది వరద నుంచి తప్పించుకున్నా.. ముగ్గురు మాత్రం సెల్లార్‌లో చిక్కుకుని బయటకు రాలేక చనిపోయారు. వర్షం, వరదతో.. షార్ట్ సర్క్యూట్ కారణంగా.. లైబ్రరీలో బయోమెట్రిక్ డోర్స్ క్లోజ్ అయ్యాయని.. ప్రమాదం నుంచి బయటపడ్డవారు చెబుతున్నారు.

మృతుల్లో ఒకరు తెలంగాణ వాసిగా, హైదరాబాద్‌కు చెందిన తాన్య సోనిగా గుర్తించారు. మృతదేహాలు ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు యూపీ, కేరళకు చెందిన అభ్యర్థులుగా పోలీసులు తేల్చారు. తాన్య మృతితో ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

నిబంధనల ప్రకారం సెల్లార్ పార్కింగ్ అవసరాలకు మాత్రమే వాడుకోవాలి. సెల్లార్‌లో లైబ్రరీలు, క్యాంటీన్‌లు ఏర్పాటు చేయొద్దు. సెల్లార్స్‌లో నివాసం కూడా ఉండొద్దు. పార్కింగ్‌కు తప్ప.. కమర్షియల్‌గా సెల్లార్స్ అస్సలు వాడొద్దు. బిల్డింగ్ కోడ్‌ కూడా ఇదే చెప్తోంది. అయినా.. నిబంధనలు ఎవ్వరూ పాటించడం లేదు. వాహనాల పార్కింగ్‌ అంతా రోడ్లపై చేస్తూ.. రూల్స్ విరుద్ధంగా లైబ్రరీలు, ఇతర అవసరాలకు సెల్లార్స్ వినియోగిస్తున్నారు. దీంతో రావ్స్ కోచింగ్ సెంటర్‌లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా కోచింగ్ సెంటర్లలో సెల్లార్స్‌లో లైబ్రరీలు ఉన్నాయని స్టూడెంట్స్ చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎవ్వరూ పట్టించుకోరని.. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు హడావుడి చేస్తారే తప్ప ఆ తర్వాత అంతా షరా మామూలే అనే వాదనలు స్టూడెంట్స్‌ నుంచి వినిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..